కేంద్రాలకు నేరుగా వస్తే వ్యాక్సిన్ వేయరు.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి

by  |
కేంద్రాలకు నేరుగా వస్తే వ్యాక్సిన్ వేయరు.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే విషయంలో ప్రభుత్వం పూటకో తీరుగా ప్రకటనలు చేయడం హైదరాబాద్ నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయంలో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. 45 ఏండ్లు ఆ పై వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయడంతో పాటు 18 నుండి 44 సంవత్సరాలలోపు వయస్సు వారు కూడా కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ముందుగా సూచించారు.

దీంతో వేల సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా వారు ఇక తమకు వ్యాక్సిన్ వేస్తారని సంతోష పడే లోపే.. వారికి వ్యాక్సిన్ వేయడం లేదని, ముందుగా 45 సంవత్సరాలు పైబడిన వారికి, రెండవ డోస్ వేసుకునే వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటనలు చేశారు. ఇందుకు www.cowin.gov.in పోర్టల్‌లో వీరు కూడా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించడంతో చాలా మంది ఆన్‌లైన్‌లో నమోదు కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ పలు కారణాల వల్ల వారు నమోదు చేసుకోలేకపోతున్నారు .

కోవాగ్జిన్ కోసం కష్టాలు..

మొదటి విడత కోవాగ్జిన్ వేసుకున్న వారు రెండవ విడత కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా పాకుతూ పోతోంది. దీంతో ప్రతినిత్యం వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ రెండవ డోస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కోవాగ్జిన్ మొదటి విడత డోస్ వేసుకున్న వారు 4-6 వారాల్లోగా రెండవ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత ఏదైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో రెండవ విడత కూడా అదే వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా గడువు దాటిన వారు, సమీపిస్తున్న వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇలా వారు కోవాగ్జిన్ కోసం పోర్టల్‌లో ప్రయత్నం చేసినా వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా రెండవ డోస్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

నేరుగా వచ్చే వారికి వ్యాక్సిన్ లేదు.. డీహెచ్

వ్యాక్సిన్ సెంటర్లకు నేరుగా వచ్చే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ వేయరని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ముందుగా 45 సంవత్సరాలు పై బడిన వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలెవరూ కూడా కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వ్యాక్సిన్ సెంటర్లకు రావద్దని ఆయన సూచించారు. రెండవ డోస్ అవసరం ఉన్న వారు కూడా కోవిన్ పోర్టల్‌లోనే పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని, పోర్టల్‌లో వారికి సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రం, సమయం సూచించడం జరుగుతుందని, ఇలా నమోదు చేసుకున్న వారు వారికిచ్చిన తేదీ, సమయంలో సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

48 లక్షలకు పైగా..

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ వరకు 48,14,784 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని డీహెచ్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో 41,77,399 మంది మొదటి డోస్ తీసుకున్న వారు ఉండగా 6,37,385 మంది సెకండ్ డోస్ తీసుకున్న వారు ఉన్నారని ఆయన తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 3వ తేదీన 41,040 మందికి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు 29,079 మందికి వ్యాక్సిన్ అందించినట్లు డీహెచ్ వివరించారు.

ఇది కూడా చదవండి:

కరోనా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా..?

Next Story

Most Viewed