ఆంధ్ర పొమ్మన్నది.. తెలంగాణ వద్దన్నది

by  |
ఆంధ్ర పొమ్మన్నది.. తెలంగాణ వద్దన్నది
X

దిశ, నల్లగొండ: పాలకుల నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ ఆ రైతులు ఏండ్ల తరబడి అవస్థలు పడుతూనే ఉన్నారు. అన్నీ తానై ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి పట్ల చిన్నచూపు చూస్తోంది. అన్నీ ఉన్నా.. వారు ఏమికాని వారిగానే మిగిలిపోతున్నారు. వారే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామం రైతులు. ఈ గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వెంట ఉన్న గ్రామం. అయితే వీరి భూములన్నీ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామ పరిధిలో ఉన్నాయి. దాదాపు రెడ్లకుంట గ్రామానికి చెందిన 32 మంది రైతులకు సంబంధించిన వంద ఎకరాలకు పైగానే భూములు ఉన్నాయి. ప్రతి సీజన్‌లో వీరి వరి పంటను సాగు చేయడం.. పండించిన పంటను అమ్ముకునేందుకు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడం వీరికి పరిపాటిగా మారింది. ‘మాకు తెలంగాణలోనే ఓట్లు ఉన్నయ్.. మేం ఇక్కడే ఓటు వేసినమ్. మా బాధలు వీళ్లు పట్టించుకోకపోతే.. ఎవరు పట్టించుకుంటరు’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రెడ్లకుంట గ్రామ రైతుల దీనావస్థపై ‘దిశ’ కథనం.

ఆంధ్రవాళ్లు కొంటలేరు..

రెడ్లకుంట గ్రామానికి సంబంధించిన 32 మంది రైతులకు సంబంధించిన ఆధార్, ఓటరు గుర్తింపు, రేషన్ కార్డులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. వారి భూములు, వాటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడీ వంటివన్నీ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. దీంతో వారు ఏటా ధాన్యం అమ్ముకునే సమయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఏటా రైతులు ఎలాగోలా అధికారులను బతిమిలాడో.. పదో పరకో చేతుల పెట్టి ధాన్యం అమ్ముకున్నారు. వాస్తవానికి ప్రతి సీజనులో రెడ్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేటోళ్లు. ప్రస్తుతం ఐకేపీ కేంద్రానికి ఈ రైతులు ఎప్పటిలాగే ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకెళ్లారు. కానీ, అక్కడ ఈ రైతులకు వింత పరిస్థితి ఎదురయ్యింది. ఆధార్‌‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు.

ఆ రైతులకు ఆధార్ కార్డు ఇక్కడ..

ఆ రైతులకు ఆధార్ కార్డు ఇక్కడ.. పట్టాదారు పాసుపుస్తకం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ధాన్యం కొనలేమని చెప్పారు. అధికారుల కాళ్లావేళ్లా పడితే.. ఒకరిద్దరి రైతుల ధాన్యాన్ని కాంటా వేశారు. అంతలోపే భూములు ఆంధ్రా ప్రాంతంలో ఉండడం వల్ల ఆ రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదు. దీంతో వెంటనే అధికారులు ఆ 32 మంది రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల్లో సంప్రదించినా.. అక్కడా అదే పరిస్థితి.

సంక్షేమ పథకాలదీ అదే పరిస్థితి..

ఒక్క ధాన్యం విషయంలోనే కాదు.. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం విషయంలో ఆ రైతులకు తీరని అన్యాయం జరుగుతోన్నది. రాష్ట్ర విభజన సమయం నాటి నుంచి ఆ గ్రామ రైతులదీ ఇదే పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో లేక.. అటు తెలంగాణలో లేక రెంటికి చెడ్డ రేవడిలా వారి పరిస్థితి తయారయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీకి ఆ రైతులు ఆమడదూరంలోనే ఉండిపోయారు. కనీసం బ్యాంకులు అందించే పంట రుణాల్లో సైతం వారికి మొండి చెయ్యే మిగిలింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఇటు తెలంగాణ ప్రభుత్వంగానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ వీరి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

కార్యాలయం చుట్టూ తిరగొద్దన్న కలెక్టర్..

రెడ్లకుంట గ్రామానికి చెందిన రైతులు ఈ విషయమై పలుమార్లు అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. సాక్షాత్తూ కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఇక్కడ ఆధార్ కార్డు లేనిదే.. మేం ఏం చేయలేం.. మాటిమాటికీ కార్యాలయం చుట్టూ తిరగొద్దంటూ బదులిచ్చారు. కోదాడ మండల తహసీల్దార్‌ను కలిసినా ప్రయోజనం శూన్యమే. రైతులకు సంబంధించిన భూములు ఉన్నది తమ పరిధి కాదని, మేం ఏం చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతులు రెడ్డకుంట ఐకేపీ కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ పథకాల సంగతేమోగానీ మేం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి దాపురించిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందు తాగి చచ్చే పరిస్థితి వచ్చింది: కునుకుంట రవి, రెడ్లకుంట రైతు

‘మేం రైతులమన్న పేరే గానీ ఏం ఫాయిదా లేదు. మేం కష్టపడి పండించిన పంటను కూడా కొంట లేరు. ఆంధ్రకు పోతే ఇక్కడ కొనం పొమ్మంటుర్రు. ఇక్కడికొస్తే పట్టాదారు పాసుపుస్తకం లేకపోతే వద్దంటుర్రు. మా ధాన్యం మేం అమ్ముకునేటందుకు ఇన్నీ కష్టాలు పడాల్నా. రోజులు గడుస్తున్నా ధాన్యం కొంటలేరు. మందుతాగి సచ్చే పరిస్థితి వచ్చింది’.

ఆన్‌లైన్‌లో కాట్లే.. వర్షం పడేటట్టు ఉంది: ప్రసాద్, రెడ్లకుంట రైతు

‘మొదటి నుంచి మా పొలాలు ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. ఆధార్ కార్డు, పాసుపుస్తకాలు ఒకేచోట లేక ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదు. తెలంగాణలో ఆన్‌లైన్‌లో వివరాలు ఎక్కట్లేదని ధాన్యం కాంటా వేయట్లేదు. ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉంటేనే కొంటామని చెబుతుర్రు. ధాన్యం ఐకేపీ సెంటర్లలో పోసి కుర్చున్నం. వర్షాలు పడేటట్టు ఉన్నాయి. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలి’

Tags: Nalgonda, Telangana, Andhra Pradesh, Redkunta farmers, Rice grain

Next Story