కేరళలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్

by  |
కేరళలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పంబా ఆనకట్టలో నీరు 983.05 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దాంతో పతనమిట్ట జిల్లాలో అధికారులు ముందస్తుగా ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.ఒకవేళ నీటి మ‌ట్టం 984.5 మీటర్ల వద్దకు చేరుకోగానే రెడ్ అలర్ట్ ప్రకటించి..డ్యామ్ గేట్లను తెరుస్తారు.

ఇప్పటికే అలూవాలోని శివాలయంలో కొంత భాగం నీటిలో మునిగిపోయింది.పెరియార్ నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుండ‌టం కాస్త ఊర‌ట క‌లిగిస్తోంది. కోజికోడ్ జిల్లాలో శుక్రవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్ర‌మాదంలో మరణించిన వారి సంఖ్య 26 కి పెరిగిందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య 42కు చేరింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అలపుజ, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్‌లకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్ ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికను, రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి పసుపు హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల వలన కేరళలో జనజీవనం స్తంభించింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.వారందరికీ ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తోంది.

Next Story

Most Viewed