కీలక వడ్డీ రేట్లు యథాతథమే

by  |
RBI
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4 శాతంగానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్దే ఉండనున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశం బుధవారం నుంచి మూడు రోజులపాటు జరిగింది. శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశానికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించారు. వరుసగా ఎనిమిదవసారి వడ్డీ రేట్లలో మార్పు చేయట్లేదని చెప్పారు. వృద్ధికి మద్దతిచ్చేందుకు అవసరమైనంత వరకు అనుకూల వైఖరిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు దాస్ తెలిపారు. క్రితంసారి ఎంపీసీ సమావేశం జరిగినప్పటి కంటే ప్రస్తుత మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృద్ధి బలపడుతోందని, ద్రవ్యోల్భణం ఊహించిన దానికంటే సానుకూలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం, ద్రవ్యోల్భణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ మరికొంత కాలం సర్దుబాటు ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు దాస్ పేర్కొన్నారు. చివరిసారిగా 2020, మే నెలలో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. అప్పటినుంచి దీన్ని యథాతథ స్థితినే ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకే సర్దుబాటు వైఖరిని అనుసరిస్తున్నామని శక్తికాంత దాస్ వివరించారు.

Next Story