ఢోకా లేదు, కానీ..

by  |
ఢోకా లేదు, కానీ..
X

దిశ, రంగారెడ్డి: ప్రస్తుతం జిల్లా ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఒకచోట ఏమీ దొరకడంలేదు.. మరికొన్ని చోట్ల ఒకటి ఉంటే ఇంకోటి దొరకడంలేదు. మొత్తంగా వారంతా అవస్థలు పడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎదురు చూపులు చూస్తున్నారు. ఎందుకో మీరూ తెలుసుకోండి.. ప్రత్యేక కథనంలో..

జిల్లాలో నిత్యావసర సరుకుల దొరకపోవడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసుకునేందుకు ప్రజలకు ఉదయం సమయంలో సడలింపు ఇచ్చారు. గత 10 రోజులుగా ఎక్కడివి అక్కడ నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల సరఫరా జరగడం లేదు. దీంతో కిరాణా షాపుల్లో విక్రయించేందుకు సరుకులు అందుబాటులో లేవు.

నూనె దొరకడంలేదు..

మారుమూల ప్రాంతాల్లోని కిరాణా దుకాణదారులు ఏ రోజు సరుకులు ఆ రోజు తెచ్చుకొని విక్రయాలు జరుపుతారు. అదే పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో నడిపే కిరాణా దుకాణదారులు వారం రోజులకు సరిపడే సరుకులను ముందే తెచ్చుకుని, వాటిని నిల్వ చేసి అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా నిత్యావసర సరుకులు దొరకడంలేదు. లాక్‌డౌన్‌తో సరుకులు సరఫరా చేసే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడింది. సరఫరా చేసేందుకు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. బతికి ఉంటే ఇంతకంటే ఎక్కువ సంపాధిస్తామని అంటున్నారు. గ్రామాలల్లో కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆ కూరగాయలు వండుకోవడానికి వంట నూనె కూడా దొరకని పరిస్థితి గ్రామాల్లో ఉంది.

దారుణం..

రేషన్ షాపులల్లో బియ్యంతోపాటు కందిపప్పు, నూనె, చక్కర తదితర సరుకులు అందిస్తామని ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఒకవేళ పప్పు, ఉప్పు, నూనె ఇవ్వకపోతే రూ.1500 ఇస్తామని చెప్పారు. 11 రోజుల నుంచి కర్ఫ్యూ కొనసాగుతున్నా ఇప్పటివరకూ నగదు, పప్పు ఇవ్వకపోవడం దారుణం. రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అదికూడా కొన్ని గ్రామాల్లోనే ఇస్తున్నారు. మెజార్టీ గ్రామాల్లోని ప్రజలు రోజు ఉదయం రేషన్ షాపుకు వచ్చి ఎదురుచూసి పోతున్నారు. ఇక్కడ కొనుకునేందుకు షాపుల్లో సరుకులు లేవు. చేసేదేమీలేక ప్రభుత్వం పంపిణీ చేసే సరుకులు, నగదు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Tags : Rangareddy, Government, Ration Rules, Goods, Vegetable, Oil, People, Villages, Towns



Next Story

Most Viewed