‘బండి’కి చెక్​…? కమలంలో కల్లోలం..!

514

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ షురూ చేశాయి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లన్నీ దాదాపు బండి సంజయ్ చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లతో కూడిన ఇమేజ్‌లు హల్‌చల్ చేస్తుండగా.. తాజాగా ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసినట్టు మరో ఇమేజ్ వైరల్ అవుతోంది. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఓ పార్టీ ఇలా కుట్రలు చేస్తోంది బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పోస్టు తనది కాదు అని, ఎవరో మార్ఫింగ్ చేశారని స్వయంగా రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఆడియో చక్కర్లు

రాజాసింగ్ తన ఆవేదనను తన సన్నిహితులతో పంచుకున్నట్టు ఓ ఆడియో క్లిప్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో తాను ప్రతిపాదించిన వ్యక్తులకు కాకుండా ఇతరులకు టికెట్లు వచ్చాయని, ఇందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారణమని, ఆయనపై అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు ఆ ఆడియో సారాంశం. ఇది సైతం ఉద్దేశపూర్వకంగా సృష్టించిందేనని ఇందులో నిజం లేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ రాజాసింగ్ మాత్రం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే బండి సంజయ్‌ ప్రాధాన్యతను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగ్గించనున్నట్లు పుకార్లు వస్తున్న సమయంలో రాజాసింగ్ సైతం ఈ తరహా అసంతృప్తిని వ్యక్తం చేసే ఆడియో బయటికి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం తలెత్తుతోంది.

బండి సంజయ్ ప్రాధాన్యతను తగ్గించి గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు మొత్తం కిషన్‌రెడ్డికే అప్పజెప్పనున్నట్టు ఆదివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా కిషన్‌రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేదా భిన్నాభిప్రాయాలు లేవని, ఈ పుకార్లను రూఢీ చేయడానికి జనసేన పార్టీతో పొత్తు అంశాన్ని జోడించడం అసందర్భమని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం నడిచే పార్టీయే తప్ప వ్యక్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నడిచేది కాదని కిషన్ రెడ్డి వెల్లడించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడని, ఆయన బాధ్యతలను తగ్గించాల్సిన అవసరమే లేదని, ఇలాంటి పుకార్లన్నీ పార్టీలో గందరగోళం సృష్టించడానికి పుట్టిస్తున్నారని.. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వెల్లడించారు.

కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు?

బండి సంజయ్, కిషన్‌రెడ్డి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని పటాన్‌చెరులో ఆదివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. వారి మధ్యనే సయోధ్య లేనప్పుడు ఇక ప్రజలకేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. నాయకత్వం కోసం బండి సంజయ్, కిషన్‌రెడ్డి మధ్య నువ్వా నేనా అనే పోరు కోసం అగ్గి రాజుకుందన్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగులు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.