లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో రైల్వే రికార్డు

by  |
Oxygen Express trains
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లతో ఒకే రోజులో 831 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ)ను సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిందని వెల్లడించారు.

ఇప్పటి వరకు భారత రైల్వే 75 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లతో 295 ట్యాంకర్లలో దాదాపు 4700 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓను సరఫరా చేసిందని తెలిపారు. ఈనెల 9న ఒకే రోజులో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్‌లు 831 టన్నుల ఎల్ఎంఓను పంపిణీ చేసి రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో 293 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ, యూపీలో 1334 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 598 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 123 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 40 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 2011 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఇప్పటి వరకు సరఫరా చేసినట్లు వెల్లడించారు.

జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో బెంగళూరు వెళ్తుందని తెలిపారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపిన ట్యాంకర్లతో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి సమయాల్లో ప్రయాణాన్ని ప్రారంభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన వెంటనే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed