గగనతలంలో ‘రాఫేల్’ రారాజు!

by  |
గగనతలంలో ‘రాఫేల్’ రారాజు!
X

న్యూఢిల్లీ: ఒకవైపు డ్రాగన్, మరోవైపు దాయాది దేశం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక అస్త్రాన్ని అమ్ముల పొదిలోకి చేర్చుకుంటోంది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే భీకర యుద్ధ విమానాలు భారత్‌కు ఎగిరివస్తున్నాయి. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్‌లోని అంబాలా ఏయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరనున్నాయి. ఈ ఫైటర్ జెట్లు భారత వైమానిక దళాన్ని పరిపుష్టం చేస్తాయి. ఐఏఎఫ్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయి. అటు చైనా, ఇటు పాకిస్తాన్ సైతం కౌంటర్ చేయలేని సమర్థవంతమైనవిగా ఈ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్టులను భద్రతావర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని దస్సాల్ట్ ప్రొడక్షన్ యూనిట్ మెరిగ్నాక్ నుంచి సోమవారం ఈ యుద్ధ విమానాలు టేకాఫ్ అయిన సంగతి తెలిసింది. సుమారు రూ.59వేల కోట్ల ఒప్పందంలో 36 విమానాలకు గానూ ఐదు ఎయిర్‌క్రాఫ్టులు వస్తున్నాయి.

పాక్‌కు చుక్కలే..

రెండు దశాబ్దాలుగా భారత వైమానిక దళం లాంగ్ రేంజ్ విపణులు, సెన్సార్‌లు లేక పాకిస్తాన్ ఎఫ్16 ముందు ఒకింత వెనుకబడింది. పాక్ దగ్గరున్న అమెరికన్ ఎఫ్16 జెట్లను ఎదుర్కోవడానికి రెండు ఎస్‌యూ30ఎంకేఐలు పోరాడాల్సి వచ్చేవి. ఈ పరిస్థితిని రాఫేల్ తిరగరాయనుంది. ఆకాశంలో రెక్కలు చాచుకుని వేటాడే రాఫేల్‌కు కౌంటర్ ఇవ్వాలంటే పాకిస్తాన్ కనీసం రెండు ఎఫ్16 విమానాలు దింపకతప్పదని భద్రతావర్గాలు తెలిపాయి. త్వరలో రష్యా నుంచి వస్తున్న ఎస్400, రాఫేల్ యుద్ధ విమానాలు అన్నీ భారత్‌కు వస్తే భారత వైమానిక దళం గగనతలంలో గాండ్రించవచ్చునని వివరించాయి. రాఫేల్‌ను సవాల్ చేసే బలాలు పాకిస్తాన్ సహా చైనాలోనూ లేవనే అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. ఈ రెండు దేశాలతో పోరులో రాఫేల్‌ను సమకూర్చుకుని ఐఏఎఫ్ ఒక్క ఉదుటున అనూహ్య సామర్థ్యాన్ని పెంచుకున్నదని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎం.మాతేశ్వరణ్ తెలిపారు.

రాఫేల్ హంగులు..

రాఫేల్ విపణులను రెక్కల కింద దాచుకుని శత్రువులను చీల్చి చెండాడుతుంది. మిటియొర్ మిస్సైల్, స్కాల్ప్ మిస్సైల్, మికా మిస్సైల్.. ఈ మూడు ముఖ్యమైన విధ్వంసకర పరికరాలు రాఫేల్‌ను అసమాన భయంకర యుద్ధవిమానంగా నిలబెడుతున్నాయి. మిటియొర్ మిస్సైల్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణి. దీని ద్వారా లక్ష్యాన్ని పైలట్ చూడలేకున్నా, ఈ మిస్సైల్ టార్గెట్‌పై నిప్పులు కురిపిస్తుంది. మానవ చూపును మించిన సామర్థ్యం కలిగి ఉండి శత్రువులను మట్టుబెడుతుంది. ఇక స్కాల్ప్ రాఫేల్ జెట్లకు తలమానికంగా ఉన్నది. ఈ స్కాల్ప్ మిస్సైల్‌తో శత్రు గగనతలంలోకి చేరకుండానే శత్రుభూభాగంలోని లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చు. లాంగ్ రేంజ్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ మిస్సైల్‌ను శత్రుదేశాలు పసిగట్టడం అసాధ్యం. రాడార్ ద్వారా కూడా దీన్ని కనుగొనలేరు. పిన్‌పాయింట్ అక్యూరసీతో పని కానిచ్చేస్తుంది. మికా మిస్సైల్‌కు సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్టుల్లో దీన్ని కలిగి ఉన్నందున భారత వైమానిక దళానికి ఈ క్షిపణి ఇప్పటికే అనుభవంలో ఉన్నది. వెంటాడి వేటాడే కార్యంలో ఇది దిట్ట. దీని యాక్టివ్ రాడార్‌లు శత్రువులు తేరుకునే లోగానే వేగంగా అటాక్ చేస్తాయి.

రెండు దేశాలకు చెక్ పెట్టేలా రాఫేల్ బేస్ స్టేషన్లు

రాఫేల్ రెండు స్క్వాండ్రన్‌లకు భారత సర్కారు వ్యూహాత్మకంగా హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్‌లోని హసిమారా(చికెన్ నెక్ సమీపంలో) బేస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. తాజా ఐదు రాఫేల్ జెట్లు అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరనున్నాయి. పాక్‌ను దృష్టిలో పెట్టుకుని అంబాలా, చైనాను దృష్టిలో పెట్టుకుని హసిమారాను ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. గతేడాది ఫిబ్రవరి బాలాకోట్ స్ట్రైక్ సమయంలో విమానాలు అంబాలా నుంచే టేకాఫ్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ బేస్ స్టేషన్ ఎల్‌వోసీ, ఎల్ఏసీల నుంచి దాదాపు సమానదూరంలో ఉన్నది. తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి రెండు వైపులా రాఫేళ్లు మోహరించడానికి పెద్దగా సమయం పట్టదు. కాగా, చైనాతో ఘర్షణలు ఏర్పడితే హసిమారా కీలకప్రాంతంగా ఉంటుంది. అందుకే రెండో స్క్వాండ్రన్‌కు ఈ బేస్ స్టేషన్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తున్నది.



Next Story

Most Viewed