రాఫెల్ రాకతో ఇకపై శత్రుదుర్భేద్యంగా భారత్..

by  |
రాఫెల్ రాకతో ఇకపై శత్రుదుర్భేద్యంగా భారత్..
X

న్యూఢిల్లీ : గగనతల రారాజు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఐదు యుద్ధ విమానాలు సగర్వంగా అంబాలా ఎయిర్‌బేస్‌లోని నేలను తాకగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక వాటర్ కెనన్లతో నీళ్లు విరజిమ్ముతూ ఘన స్వాగతం పలికింది. సోమవారం ఫ్రాన్స్‌లోని మెర్గానిక్ ఎయిర్ బేస్‌ నుంచి భారత వాయుసేన అధికారులు రఫేల్ యుద్ధ విమానాలను తీసుకొని భారత్‌కు బయల్దేరారు. మంగళవారం యూఏఈలోని అల్ దఫ్రాలో గల ఫ్రాన్స్ ఏయిర్ బేస్‌లో కొద్దిసేపు ఆగాయి. అక్కడి నుంచి బయల్దేరి భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన తర్వాత పశ్చిమ అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధనౌక‌ ఐఎన్‌‌ఎస్ కోల్‌కతాతో ఫైలట్లు సంభాషించారు. ‘భారత సముద్ర జలాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. సగర్వంగా నింగిని తాకండి’ అని యుద్ధ నౌక నుంచి రాఫేల్ కమాండర్లకు ఆడియో సందేశం వెళ్లింది. దాదాపు 7000కి.మీ. దూరం ప్రయాణించిన అనంతరం రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతంలోకి చేరుకోగానే సుఖోయ్ 30 ఎంకేఐ జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా వచ్చాయి. భారత్‌కు వచ్చిన ఐదు విమానాల్లో మూడు సింగిల్ సీటర్, రెండు టూ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇవి ఎయిర్‌ఫోర్స్‌లోని 17వ స్క్వాడ్రన్‌లో భాగం కానున్నాయి. ఈ స్క్రాడ్రన్‌ ‘గోల్డెన్ అర్సో’గా ప్రాచూర్యం పొందింది. దాదాపు 23 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత్ పశ్చిమ దేశాల నుంచి యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంది. చివరగా సుఖోయ్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం గమనార్హం. అంబాలా వైమానిక స్థావరం పాకిస్తాన్ సరిహద్దు నుంచి కేవలం 200 కి.మీ.ల దూరంలో ఉంది. రఫేల్ యుద్ధ విమానాల రాక నేపథ్యంలో చుట్టుపక్కల నాలుగు గ్రామల్లో ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడటం, భవనాలపై చేరడం, ఫొటో, వీడియో చిత్రీకరణపై నిషేధం విధించారు.

‘పక్షులు సురక్షితంగా చేరుకున్నాయి’

‘గోల్డెన్ అరోస్ ఇంటికి స్వాగతం. నీలి ఆకాశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది’ అని భారత వాయుసేన ట్వీట్ చేసింది. దీనికి బాణం ఆకారంలో గగనతంలో రఫేల్, సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధ విమానాలు వస్తున్న ఫొటోను జత చేసింది. అంబాలా ఎయిర్‌బేస్‌లో ‘పక్షులు’ సురక్షితంగా చేరుకున్నాయి అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘రఫేల్ యుద్ధ విమానాల చేరికతో మన రక్షణ దళాల చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ యుద్ధ విమానాలు భారత వాయుసేన సామర్థ్యాన్ని ఎంతో పెంపొందిస్తాయి’ అని వరుస ట్వీట్లలో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

అత్యాధునికమైన రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌‌కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్స్‌తో 2016, సెప్టెంబర్ 23న భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొత్తం 36 విమానాలకు రూ.59,000కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇందులో 10 రాఫేల్ యుద్ధ విమానాలను భారత్‌కు ఈ నెలలో అందజేసింది. ఐదు యుద్ధ విమానాలను భారత్‌కు తీసుకురాగా, మరో ఐదు మనదేశ వైమానిక కమాండర్ల శిక్షణ కోసం ఫ్రాన్స్‌లోనే ఉండనున్నాయి. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు మన సైనిక పాటవాన్ని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed