మిస్ యూనివర్స్‌గా హర్నాజ్.. ప్రముఖుల నుంచి అభినందనలు 

by  |
Harnaz Miss Universe
X

న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్-2021 పోటీలో భారత్ మెరిసింది. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు ఈ ఏడాది విశ్వసుందరిగా ఎంపికైంది. సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఈ సుందరి భారత్ తరఫున విజేతగా నిలిచింది. ఇజ్రాయిల్‌లో జరిగిన అందాల పోటీలో 2020 విశ్వసుందరి ఆండ్రియా మెజా(మెక్సికో) చేతుల మీదుగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 80 మందికి పైగా యువతులు పాల్గొన్న ఈ పోటీలో వాళ్లందరినీ వెనక్కి నెట్టిన హర్నాజ్.. భారత్‌ తరఫున మూడో మిస్ యూనివర్స్ టైటిట్‌ను గెలుచుకుంది.

అంతకుముందు ఇద్దరు భారతీయులు ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. 1994లో సుస్మితాసేన్, 2000లో లారా దత్తా విశ్వసుందరిగా ఎంపికయ్యారు. కాగా, ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులుగా తమదైన ముద్ర వేయడం విశేషం. మొదటి రన్నరప్‌గా పెరుగ్వే యువతి నాడియా ఫెరీరా(22), రెండో రన్నరప్‌గా దక్షిణాఫ్రికా యువతి లాలెలా మస్వానే(24) నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా నిలవడంతో యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతకుముందు 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్‌తో తన మిస్ యూనివర్స్ యాత్రకు బీజం పడింది. 21 ఏళ్ల ఈ విశ్వసుందరి ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. కాగా, ఇప్పటికే ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019కు గానూ ఎంపికైంది.

మిస్ చండీగఢ్ నుంచి..

పంజాబ్‌లోని చండీగఢ్‌లో 2000 మార్చి 3న జన్మించిన హర్నాజ్ చిన్నతనం నుంచే నటన, మోడలింగ్‌లో ఆసక్తి కనబర్చింది. ఓ పక్క చదువుకుంటూనే, సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలో 2017లో జరిగిన టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో విజయం సాధించడం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఆ పోటీల్లో మిస్ చండీగఢ్‌గా ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా ప్రతి అందాల పోటీలోనూ పాల్గొంటూ వచ్చింది. 2019లో మిస్ పంజాబ్‌గా ఎంపికైంది. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో విజేతగా నిలవడంతో, మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. కాగా, హర్నాజ్ నటించిన పంజాబ్‌ సినిమాలు ‘బాయి జీ కుట్టాంగే’, ‘యారా దియా పూబరన్‌’ అనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కిరీటం తెచ్చిన సమాధానం..

విశ్వసుందరి కిరీటానికి అందం మాత్రమే కాదు ఆలోచన కూడా కావాలి. జడ్జిలను మెప్పించేలా ఆచరణ యోగ్యమైన సమాధానం కూడా ఇవ్వాలి. అప్పుడే, విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టాప్ త్రీ కంటెస్టెంట్లను ‘యువత ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరిచ్చే సలహా ఏంటి’ అని అడగ్గా.. ‘యువత తమను తాము నమ్మకపోవడమే పెద్ద సమస్య. ఎవరికి వారే ప్రత్యేకమని గుర్తించలేకపోతున్నారు. తమ జీవితాన్ని వారే అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చర్చించాలి. దీనివల్ల మీ గురించి మీకు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే.. మీ జీవితానికి మీరే నాయకులు. నన్ను నేను నమ్మాను కాబట్టే.. ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను’ అని హర్నాజ్ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయనిర్ణేతలు హర్నాజ్‌కు పట్టం కట్టారు. కాగా, గతంలో తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సన్నగా ఉన్నానని ఏడిపించారని చెప్పారు.

ప్రశంసల వెల్లువ

మిస్ యూనివర్స్‌గా నిలిచిన హర్నాజ్‌కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘విశ్వసుందరి కిరీటాన్ని ధరించిన హర్నాజ్‌కు అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ‘మిస్ యునివర్స్‌గా నిలిచిన హ‌ర్నాజ్ కౌర్ సంధుకు శుభాకాంక్షలు. మా క్లబ్‌లోకి సుస్వాగతం. దీనికోసం 21 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాం. శతకోటి కలలు నిజమయ్యాయి’ అని లారా దత్తా ట్వీట్ చేశారు. మరో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సైతం హర్నాజ్‌ను అభినందించారు. వీరితోపాటు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్, కిరణ్ ఖేర్, బాలీవుడ్ నటులు కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, సెలినా జైట్లీ‌లు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వార్తతో వారాన్ని ప్రారంభించడం కంటే ఉత్తమ మార్గం లేదు’ అని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

భారత విశ్వసుందరిలు వీరే..

  1. సుస్మితా సేన్(1994)
  2. లారా దత్తా(2000)
  3. హర్నాజ్ కౌర్ సంధూ(2020)

చిక్కుల్లో అందగత్తెలు



Next Story

Most Viewed