23 మందికి కరోనా అంటించాడు.. 100 మందిని కలిశాడు

by  |
23 మందికి కరోనా అంటించాడు.. 100 మందిని కలిశాడు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 వేల మందిని కబలించిన కరోనా వైరస్ అంటే ఇప్పటికీ కొందరికి పట్టడం లేదు. ఈ మహమ్మారిని తక్కువ అంచనా వేస్తున్నారు. ‘ఆ వైరస్ నన్నేం చేయగలదు. ఒకవేళ వైరస్ సోకిన తట్టుకునే శక్తి ఉన్నది’ అన్న ధోరణిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలతోనే మొన్నటి వరకు ఎయిర్ పోర్టుల్లో ధర్మల్ స్క్రీనింగ్ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ అమల్లో ఉన్నా పట్టనట్టు రోడ్లపై తిరుగుతున్నారు. కానీ వైరస్ సోకిన ఒక్క వ్యక్తి చాలు.. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో మందికి వ్యాప్తి చెందించడానికి. అప్పుడు కేసులు పదులు వందలు.. వందలు వేలు అవుతాయి. దీనికి పంజాబ్ లో కరోనాతో మృతిచెందిన ఓ వ్యక్తి ఉదంతం సరిగ్గా సరిపోతుంది.

పంజాబ్లో 33 మందికి కరోనా సోకింది. అయితే ఇందులో 23 మందికి ఒకే ఒక వ్యక్తి నుంచి వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఓ గురుద్వారా పూజారి(70) ఈ నెల 18న పంజాబ్ లో కరోనాతో మృతి చెందాడు. పొరుగు ఊరిలోని ఇద్దరు మిత్రులతో కలిసి ఆయన రెండు వారాలు ఇటలీ, జర్మనీలలో పర్యటించి ఈ నెల 6 ఢిల్లీకి చేరుకుని.. అటునుంచి పంజాబ్ కు తిరిగివచ్చాడు. విదేశాల నుంచి వచ్చినందున స్వచ్ఛంద నిర్బంధాన్ని పాటించాలని అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఖాతరు చేయలేదు. ఈనెల 8 నుంచి 10వ తేదీల్లో ఆనంద్ పూర్ సాహిబ్ లో ఓ కార్యక్రమానికి హాజరై షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతనిలో కరోనా పాజిటివ్ తేలే వరకే దాదాపు 100 మందిని కలిశాడు. తన ఇద్దరు మిత్రులతో కలిసి దాదాపు 15 గ్రామాలను సందర్శించినట్లు తెలిసింది. అనంతరం.. ఈనెల 18న కరోనాతో బాధపడుతూ మృతిచెందారు.

ఇప్పుడు ఆ పూజారి కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతడి మనవడు, మనవరాళ్లు అనేకమందిని కలిశారు. క్వారంటైన్ లో ఉండకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగిన కారణంగా ఇప్పుడా ముగ్గురిని కలిసిన వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు మునిగిపోయారు. ఇంకా ఎంతమందిలో కరోనా పాజిటివ్ గా తేలనుందో వేచి చూడాల్సిందే. ఆ ముగ్గురు నవన్ శహర్, మొహలీ, జలంధర్, అమృత్ సర్, హోషియార్పూర్ లలో వైరస్ ను వ్యాప్తి చేసినట్టు అధికారులు భావిస్తున్నారు.

Tags: Coronavirus, punjab man, infected, spread, reckless socialization

Next Story

Most Viewed