అధికారుల నిర్లక్ష్యం.. ‘డబుల్’ కష్టాలతో ప్రజల ఇక్కట్లు..

by  |
MNCL
X

దిశ, మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ.. ఆ ఇళ్ల వద్ద పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని రాజీవ్ నగర్‌లో కొన్ని డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయింది. ఇండ్లు కోల్పోయిన కొంత మంది బాధితులకు ఇక్కడ ఇండ్లు కేటాయించారు.

దాదాపు 30 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే సౌకర్యాలు సరిగ్గా లేక వారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీళ్ళు నిలువ ఉండి నానా అవస్తలు పడుతున్నామని వాపోతున్నారు. 30 కుటుంబాలకు ఒక్కటే బోర్ ఉండటంతో నీటి సరఫరా సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఇంకొక్క బోర్ అయిన వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు కొన్ని డబుల్ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నందున కిటికీ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అవి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, ప్రస్తుతం అందులో నివాసం ఉంటున్న మిగతా కుటుంబాలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

MNCL2

Next Story

Most Viewed