తూతూ మంత్రంగా నమోదు ప్రక్రియ 

by  |
తూతూ మంత్రంగా నమోదు ప్రక్రియ 
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధరణిలో వ్యవసాయేతర ఆస్థుల నమోదు ప్రక్రియ బస్తీలలో తూతూ మంత్రంగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 1వ తేదీ నుండి వ్యవసాయేతర ఆస్థుల నమోదు ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. 10 వ తేదీతో గడువు ముగియనుండగా మహా నగర పాలక సంస్థ అధికారులు నమోదు ప్రక్రియ వేగవంతం చేయకపోవడం గమనార్హం.

ఆస్థుల సమాచారం సేకరణ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి అనేలా ఉంది. కేవలం పది రోజుల వ్యవధిలో గ్రేటర్ పరిధిలోని లక్షల ఆస్థుల నమోదు ఎలా సాధ్యం అనేది వెనకా ముందు ఆలోచించకుండా ప్రభుత్వం అధికారులపై నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో ఆస్థుల నమోదు చేసేందుకు తిరుగుతున్న అధికారులు సిబ్బందికి ఎన్నో సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రజల నుండి సహకారం అంతంత మాత్రంగానే ఉండగా పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో సర్కిల్ స్థాయి అధికారులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.

ఔట్ సోర్సింగ్ సిబ్బందితో…

జీహెచ్ఎంసీ పరిధి లోని ప్రతి సర్కిల్ పరిధిలో రెగ్యులర్ అధికారులు, సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా వ్యవసాయేతర ఆస్థుల నమోదు బాధ్యతలు అప్పగించారు. ఎంటమాలజీ విభాగం, పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న ఎస్ఎఫ్ఏ లను కూడా నమోదు కోసం వినియోగిస్తుండగా వారికి అంతగా చదువు లేకపోవడం సమస్యగా మారింది. దీనికితోడు వీరి వద్ద అండ్రాయిడ్ ఫోన్ లు లేవు.

కొంత మంది దగ్గర ఉన్నా యాప్ డౌన్ లోడ్ చేసి అందులో ఆస్థుల వివరాలు నమోదు చేయడం వారికి తలకు మించిన భారంగా మారుతోంది. ఒక్కోక్కరు ప్రతి రోజు 50 ఆస్థుల వివరాలు సేకరించవలసి ఉండగా కనీసం 10 నుండి 15 మంది ఆస్థుల వివరాలు పోర్టల్ లో నమోదు చేయలేకపోతున్నారు.

మాసార్లు చెప్పారు… మేం వచ్చాం…

హైదరాబాద్ వంటి మహా నగరంలో ఆస్థుల సేకరణ అనేది అంత ఆషామాషి కాదనేది అధికారులు ప్రత్యక్ష్యంగా గుర్తించ లేక పోతున్నారని ఆస్థుల యజమానులు మండిపడుతున్నారు. పోర్టల్ లో ఆస్థుల వివరాలు నమోదు చేయడం అనే ప్రక్రియ అంతంత మాత్రం పరిజ్ఞానం ఉన్న సిబ్బందితో కావడం లేదు. దీంతో యజమానులు అడిగే అనుమానాల నివృత్తికి వారి వద్ద సమాధానం ఉండడం లేదు.

ఏమో సార్ మా సార్లు చెప్పారు, మేం వచ్చాం, మీరు రాసిస్తే తీసుకువెళ్తాం, లేకపోతే వెళ్లిపోతామని కొంత మంది అంటుండగా… మరి కొంత మంది ఫోన్ చేతికి ఇచ్చి వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ధరణి లో నమోదుకు అవసరమైన వివరాలు రాసివ్వాలని ఫార్మట్ లో ఉన్న పేపర్ ను చేతికి అందిస్తున్నారు. కొంత మంది ఫారాలకు కూడా రూ 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సమయం తక్కువ వత్తిడి ఎక్కువ…

కేవలం పది రోజుల వ్యవధిలో ధరణిలో వ్యవసాయేతర ఆస్థుల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించడంతో జీహెచ్ఎంసీ అధికారులలో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓ వైపు ఉదయం 8 గంటల నుండే బస్తీలలో తిరగవలసి రావడం, యజమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి రావడంతో వారు శారీరకంగా , మానసికంగా అలసి పోతున్నారు. దీనికి తోడు జోనల్ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు గంట గంటకు ఫోన్ లు చేసి నమోదు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

దీంతో అటు అధికారులతో మాట్లాడలేక, భవనాల యజమానులకు సమాధానాలు చెప్పలేక వారు మానసిక ఆందోళనలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నమోదుకు గడువు పెంచుతుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నమోదు గడువు పెంచకపోతే ఆస్థుల నమోదు చేయనివారి పరిస్థితి ఏమిటనేది అధికారులు, యజమానుల మద్య జవాలు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.



Next Story

Most Viewed