గర్భిణులకు వైద్య పరీక్షలు గగనం..!

by  |
గర్భిణులకు వైద్య పరీక్షలు గగనం..!
X

– అటకెక్కిన ఆరోగ్య నిర్వహణ

దిశ, మేడ్చల్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. సాధారణ రోగులతోపాటు గర్భిణులకూ ఇబ్బందులు తప్పడం లేదు. పీహెచ్‌సీల్లో ప్రతినెలా గర్భిణులకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు చేసేవారు. తల్లి ఆరోగ్యంతోపాటు గర్భంలో బిడ్డ ఎదుగుదలను పరీక్షించేవారు. గర్భిణులు సుఖ ప్రసవమయ్యేలా మందులు ఇచ్చేటోళ్లు. ప్రస్తుతం పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లల్లో వైద్యాధికారులతోపాటు సిబ్బంది కూడా కరోనా విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రైవేటు వైద్యులు సైతం అందుబాటులో ఉండటం లేదు. దీంతో గర్భిణులకు వైద్యపరీక్షలు గగనమవుతున్నాయి.

ఆ రంగం, ఈ రంగం అని రంగాలపై పడిన కరోనా ఎఫెక్ట్ గర్భిణులపైనా పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష మాతృ అభియాన్ పథకం కింద అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ప్రతినెలా గర్భిణులకు హెచ్‌బీ, హెచ్‌ఐవీ, థైరాయిడ్, షుగర్, యూరిన్ తదితర పరీక్షలు చేసి తల్లితోపాటు గర్భంలో బిడ్డ ఎదుగుదలను వైద్యులు పరీక్షించి.. సలహాలు సూచనలు ఇస్తారు. కానీ, ఇవేవీ ఇప్పుడు జరగడం లేదు.

లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 23 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను జిల్లా కేంద్రంలోనో, మరో చోటనో అత్యవసర సేవల నిమిత్తం తీసుకున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన ప్రాథమిక ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసి సాధారణ రోగులకు సంబంధించిన ఇంటింటి సర్వే చేపడుతున్నారు. దీంతో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందడం లేదు. ఈ నెలకు సంబంధించి గర్భిణులకు నిర్వహించాల్సిన ప్రత్యేక పరీక్షలు నిలిచిపోయాయి. ఇప్పట్లో జరిగేలా లేవు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ సేవలు సైతం నిలిచిపోయాయి. మరోవైపు వైద్య పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబ్‌లూ మూతపడ్డాయి. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతినెలా గర్భిణులను వైద్య పరీక్షలతో పాటు ప్రసవాల కోసం పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు తీసుకువెళ్లే బాధ్యత ఆశావర్కర్లదే. కానీ, ప్రస్తుతం కరోనా ప్రభావంతో విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారిని గుర్తించే పనిలో ఆశా కర్యకర్తలు ఉన్నారు. దాంతో గర్భిణులకు సేవలు అందడం లేదు. మరోవైపు పురిటి నొప్పుల స‌మయంలో రవాణా కష్టాలు ఉన్నాయి. అయితే, కొన్ని చోట్ల 108 అంబులెన్స్‌లకు సమాచారం ఇచ్చి వాటిల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కానీ, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కరోనాపై పడటంతో గర్భిణుల రక్షణ, ఆరోగ్యం పట్ల స్పందించే డాక్టర్లు ఉండటం లేదు. అత్యవసర రోగులకు అందుబాటులో కంట్రోల్ రూంలు ఉన్నాయి. గర్భిణులకు లేవు. దీంతో అత్యవసరమైతే తమ పరిస్థితి ఏంటని గర్భిణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలనీ, తమ కోసం ప్రత్యకే కంట్రోల్ రూం ఏర్పాటు చేసి వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Tags: health checkup, blood, urine and other tests, non availability of health dept staff



Next Story

Most Viewed