జెండాకు అవమానంతో దేశం బాధపడింది : ప్రధాని మోడీ

by  |
PM Modi
X

న్యూఢిల్లీ: రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకమవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి నేరుగా ప్రస్తావించారు. ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, లాల్ ఖిల్లాపై జాతీయ జెండాకు అవమానం జరిగిందని అన్నారు. ఈ అవమానంతో దేశ ప్రజలు బాధపడ్డారని పేర్కొన్నారు. రానున్న కాలంలో మరింత ఆశాజనకంగా పనిచేయాలని, గతేడాది భారతీయులందరూ ఆదర్శవంతంగా మెలిగారని తెలిపారు. అవసరానికి తగినట్టుగా ఓపిక, ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. ఈ ఏడాది కూడా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి అదే విధంగా నడుచుకోవాలని సూచించారు.

ఆత్మ నిర్భరతకు నిదర్శనం

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కరోనాపై పోరాటం గురించీ ప్రధాని మాట్లాడారు. కరోనా పై పోరుకు ఏడాది కాలం ముగించిన నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టామని వివరించారు. భారత పౌరులు కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రపంచదేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అదే తీరులో టీకా పంపిణీలోనూ భారత్ మిగతా దేశాలకు దిక్సూచీలా నిలుస్తున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తున్నదని తెలిపారు. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా మన దేశమే నిర్వహిస్తున్నదని అన్నారు. 15 రోజుల వ్యవధిలో ఇక్కడ 30 లక్షల మంది లబ్దిదారులకు టీకా అందించగలిగామని వివరించారు. 30 లక్షల మందికి టీకా వేయడానికి అమెరికాకు 18 రోజులు పట్టిందని, యూకే 36 రోజులు పట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలను కృషిని ప్రశంసించారు. ఈ సంస్థలు మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలకు టీకాలను ఎగుమతి చేసి ఆదుకుంటున్నాయని వివరించారు. భారత్ ఆత్మనిర్భరతకు ఇదే నిదర్శనమని తెలిపారు. మెడిసిన్స్, వ్యాక్సిన్ రంగాల్లో భారత స్వావలంబన సాధించిందని, అందుకే ఇతర దేశాలకూ టీకాలను పంపిణీ చేయగలిగే స్థాయికి చేరుకుందని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ స్వయంసమృద్ధ దేశంగా అవతరించిందని చెప్పారు. ప్రజల వైఖరిలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని, మేడీన్ ఇండియా ఉత్పత్తులనే వారు డిమాండ్ చేస్తున్నారని వివరించారు.

ప్రధాని ప్రసంగంలో బోయిన్‌పల్లి మార్కెట్

ప్రధాన మంత్రి మోడీ తన ప్రసంగంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ను ప్రస్తావించారు. ఈ మార్కెట్‌లోని ట్రేడర్లు కూరగాయల వ్యర్థాలను బంగారంగా మార్చే ప్రయాణానికి శ్రీకారం చుట్టారని ప్రశంసలు కురిపించారు. కూరగాయల మార్కెట్‌లో వ్యర్థాలు కుళ్లిపోయి అపరిశుభ్రం పరిస్థితులకు కారణమవుతాయని, కానీ, బోయిన్‌పల్లి మార్కెట్ వ్యాపారులు, వర్తకులు ఈ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఇది ఆవిష్కరణ శక్తికి ఉదాహరణ అని అన్నారు. మార్కెట్‌లో వ్యర్థాలతో 500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని, దీనికితోడు 30 కిలోల బయో ఫ్యూయల్‌నూ తయారుచేస్తున్నారని వివరించారు.

Next Story

Most Viewed