రేపు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు

by  |
రేపు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ హోం మంత్రిత్వశాఖ వర్గాలు మాత్రం అలాంటి సమావేశం జరిగే అవకాశం ఉందని, ఈ నెల 31వ తేదీతో ముగియనున్న అన్‌లాక్ 2.0 తర్వాత మరో అన్‌లాక్‌ను 3.0 పేరుతో కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వాలు తీసుకుంటున్న కట్టడి చర్యలు, మృతుల సంఖ్య ఏ తీరులో ఉంది, చికిత్స నుంచి కోలుకుంటున్నవారి శాతం ఎలా ఉంది, వైద్యారోగ్య రంగంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు తదితర పలు అంశాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ సమావేశం సందర్భంగా చర్చించే అవకాశం ఉంది.

అన్‌లాక్ 3.0లో ఉండాల్సిన అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు హోంశాఖ వర్గాల సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఈ సమావేశంలో ప్రధానితో పాటు పాల్గొనే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని సమావేశం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖల అధికారులు రాష్ట్రాలతో చర్చించి వాటికి అనుగుణమైన మార్గదర్శకాలను చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎక్కువమంది గుమికూడే లాంటి అవకాశాలకు తావు ఇవ్వకుండా ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయాన్నే ముఖ్యమంత్రులు వెల్లడిస్తారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Next Story

Most Viewed