భద్రాద్రి రాముడి పేరిట అర్చకుల దోపిడీ!

by  |
భద్రాద్రి రాముడి పేరిట అర్చకుల దోపిడీ!
X

దిశ, ఖమ్మం ప్రతినిధి: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్యకు విశ్వవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయన వేడుకలంటే వారంతా తన్మయత్వంలో మునిగి తేలుతారు. ఈ భక్తిభావాన్నే కొందరు అర్చకులు, వేద పండితులు సొమ్ము చేసుకుంటున్నారు. సుగుణాలతో, భక్తి ప్రపత్తులతో ఉండాల్సినవారు దొడ్డిదారిన అందినకాడికి దండుకుంటున్నారు. విదేశాలలో భద్రాద్రి దేవస్థానం పేరిట స్వామివారి కల్యాణాలు ఘనంగా జరిపిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కానుకలను, పట్టు వస్త్రాలను సొంతం చేసుకుంటున్నారు. దేవస్థానానికి మాత్రం చిల్లిగవ్వ కూడా దక్కడం లేదు.

భక్తులు తమకు తోచిన రీతిలో దేవుడికి విరాళాలు, కానుకలు సమర్పించడం సహజం. అవన్నీ కూడా దేవస్థానికే చెందాలి. ఇలాగే భద్రాచలం దేవస్థానం పేరున భారీ మొత్తంలో వచ్చిన సొమ్ము, విరాళాలు, కానుకలు, ఆభరణాలు, పట్టువస్త్రాలు ఇలా ఏవీ దేవస్థానానికి చేరకుండా పలువురు జేబులో వేసుకుంటున్నారు. ఈ తంతు కొన్ని సంవత్సరాలనుంచి జరుగుతున్నా దేవాదాయశాఖ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అమెరికాతోపాటు, గల్ఫ్ దేశాలలో భద్రాద్రి దేవస్థానం తరఫున రామయ్య పెళ్లి జరపడానికి సిద్ధమవుతున్నారు. రూ. కోట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంత భారీ కుంభకోణం అధికారులు నోరు మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో భద్రాద్రి రామయ్యకు భక్తులు అధికంగా ఉంటారు. దీంతో భద్రాచలం దేవస్థానంలో పనిచేసే కొందరు అర్చకులకు కాసుల పంట పండుతోంది. 2014లో రామయ్య కల్యాణాల పేరిట అమెరికాలో జరిగిన వేడుకలలో దాదాపు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు నిర్వాహకులు, అర్చకులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. దేవస్థానానికి చిల్లి గవ్వ కూడా రాలేదు. 2018లోనూ ఇలాగే అమెరికాలో కల్యాణాల పేరిట కోట్లలో సొమ్మును రాబట్టుకున్నారు.

అసలేం జరిగింది

అమెరికాలోని దాదాపు 22 చోట్ల 2014 ఏప్రిల్ లో భద్రాద్రి రాముడి కల్యాణాలు వైభవంగా జరిగాయి. భద్రాచలం రామాలయ అర్చకులే ఈ కల్యాణాలను చేయించారు. భద్రాద్రి రామయ్య దర్శన భాగ్యం కలిగిందని అక్కడ ఉన్న తెలుగువారంతా సంబురపడ్డారు. వీటిని నిర్వహించిన సంస్థ భద్రాద్రి దేవస్థానం పేరిటే టిక్కెట్లను అమ్మింది. కల్యాణానికి హాజరైన ఒక్కొక్క జంట నుంచి రెండు వేల డాలర్లు వసూలు చేసింది. అప్పటి లెక్కల ప్రకారం ఆ విలువ రూ. లక్షా ఇరవై వేలు. ఒక్కోచోట దాదాపు 150 జంటలు హాజరయ్యాయి. అంటే ఒక్కోచోట రూ. కోటిన్నర నుంచి రెండు కోట్లు వసూలు చేశారన్నమాట.

ఇలా దాదాపు రూ. 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వసూలు చేశారు. వందల సంఖ్యలో వచ్చిన పట్టు పంచెలు, పట్టు చీరెలలో ఒక్క నూలుపోగు సైతం భద్రాద్రి రామయ్యకు రాలేదు. అదనంగా భక్తులు సమర్పించిన కట్నకానుకలూ దేవస్థానికి చేరలేదు. హుండీ ఆదాయం కూడా అర్చకులు, నిర్వాహకులు కలిసి నొక్కేశారు. ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది రామభక్తులు అప్పటి భద్రాచలం ఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. గొడవ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామయ్య భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన వారిని బుజ్జగించారని సమాచారం. అమెరికా సంస్థతో మాట్లాడానని భద్రాచలంలో 30 గదుల కాటేజీ నిర్మిస్తామని వారు హామీ ఇచ్చారని ఈవో చెప్పినట్టు తెలిసింది. ఇప్పటి వరకు కాటేజీ నిర్మాణం కాదు కదా, విదేశాలలో రామయ్య పేరిట చేసే దోపిడీ కూడా ఆగలేదు.

సొంత విగ్రహాలతో

ఏటా అమెరికాసహా గల్ఫ్ దేశాలలో భద్రాద్రి రాముడి పేరుతో కొన్ని సంస్థలు కల్యాణాలు జరిపిస్తుంటాయి. వీటిని దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే జరిపించాలి. వచ్చిన సొమ్మును, కానుకలను దేవస్థానానికే ఇవ్వాలి. నిర్వాహకులు మాత్రం దేవస్థానంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులతో కుమ్మక్కై దేవస్థానికి సంబంధం లేకుండానే కల్యాణాలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి రామయ్యకు నయాపైసా అందడం లేదు. విదేశాలలో రామయ్య కల్యాణాలు జరిపించాలంటే దేవాదాయశాఖ అనుమతి పొందాలి. అక్కడ జరిపించే తంతుకు ఏం కావాలన్నా దేవస్థానం నుంచే తీసుకెళ్లాలి.

టిక్కెట్ల విక్రయం, విగ్రహాల తరలింపు, పూజా సామగ్రి అంతా దేవస్థానమే ఏర్పాటు చేయాలి. అర్చకులు, వేద పండితులు దేవాదాయ శాఖకు చెప్పకుండానే సెలవుపై విదేశాలకు వెళ్లారు. అది కూడా విజిటింగ్ వీసా మీద వెళ్లారు. అక్కడ దేవస్థానం విగ్రహాలతో కాకుండా సొంత విగ్రహాలతో కళ్యాణాలు జరిపించారు. దేవస్థానికి సంబంధం లేకుండానే ప్రతి ఒక్కటీ చేశారు. భద్రాచలం దేవస్థానం పేరును మాత్రం వాడుకున్నారు. వచ్చిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారు. స్వామివారి కల్యాణం విదేశీయులకు మహద్భాగ్యంగానే చెప్పాలి. వచ్చిన సొమ్మును స్వామివారి ఖాతాకు కాకుండా సొంతానికి మళ్లించుకోవడం మంచిది కాదంటున్నారు రామభక్తులు. సొంత విగ్రహాలతో కార్యక్రమాలు జరిపించడం తమ మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉందంటున్నారు.

మళ్లీ కళ్యాణాలు

ఇంత భారీ మొత్తంలో కుంభకోణం జరిగినా అధికారులు సీరియస్ గా స్పందించలేదు. బాధ్యుల మీద నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. దీంతో సదరు అర్చకుల తీరు మారలేదు. మళ్లీ విదేశాలలో స్వామివారి కల్యాణాలు అంటూ ప్రచారం చేయిస్తున్నారు. గతంలో మాదిరిగానే అమెరికాలో రామయ్య పెళ్లి అతి త్వరలో జరిపిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ సారి ఇంకా పెద్ద మొత్తంలో దండుకునేందుకు భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. స్వామివారి పేరు మీద అందమైన బ్రోచర్లు, ఆకర్షణీయంగా ఉండే కొటేషన్లతో, ఆధ్యాత్మిక భావన కలిగించే విధంగా పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నారని సమాచారం.

దీంతో రామయ్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఏ కల్యాణం భద్రాద్రి రామయ్య పేరు మీద జరిగినా టికెట్ సొమ్ములు, కానుకలు, కట్నాలు, పట్టు వస్త్రాలు, హుండీ ఆదాయం దేవస్థానానికే చెందాలని డిమాండ్ చేస్తున్నారు. అర్చకులు, వేదపండితులు, దేవస్థానం ఉద్యోగులను అధికారికంగా ప్రభుత్వం తరఫున పంపించాలంటున్నారు. ప్రభుత్వం దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, గతంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలూ వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

రాముడి కీర్తిని విశ్వవ్యాప్తం చేయండి

శ్రీ రాముడి కల్యాణాలు విశ్వవ్యాప్తం చేయండి. ప్రతి పైసా రాముడికే చెందాలి. ఆయన్ను నిత్యం పూజించే అర్చకులు, వేద పండితుల మీద అపారమైన ఇష్టం, గౌరవం ఉన్నాయి. ఓ సంస్థతో ఇలా దోచుకోవడం బాధాకరం. గతంలో జరిగిన దానిపై కూడా విచారణ జరగాలి. రాముడి పేరుతో సొమ్ములు కాజేయాలని చూసేవారిని వదలకూడదు. విజిటింగ్ వీసాతో అమెరికా వెళ్లి ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు చేసే అర్చకులు అక్కడ కల్యాణాలు చేస్తే చట్ట ప్రకారం వారిని తక్షణం అరెస్టు చేయవచ్చు. వారి పాస్ పోర్టు, వీసా రద్దు చేయవచ్చు. వారి ఉద్యోగానికి కూడా ప్రమాదం. -ఓ ఎన్నారై భక్తుడు

ఇప్పటి వరకూ నా దృష్టికి రాలేదు: శివాజీ, భద్రాచలం రామాలయం ఈవో

గతంలో జరిగిన విషయాలు నాకు తెలియదు.. ఇప్పుడు భద్రాచలం దేవస్థానం నుంచి అర్చకులు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విషయం కూడా ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. మళ్లీ అలా జరగకుండా చూస్తాం. ఈ సారి అమెరికా వెళ్లేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వం. దేవాదాయశాఖ అనుమతి లేకుండా అలా చేస్తే ఎంక్వైరీ చేస్తాం.. నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.

Next Story

Most Viewed