కార్గిల్ యోధులకు నివాళులు

by  |
కార్గిల్ యోధులకు నివాళులు
X

న్యూఢిల్లీ: ఆదివారం కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. సాధారణ పౌరులు మొదలు సెలెబ్రిటీలు, రాష్ట్రపతివరకు వారి సాహసాలను మననం చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ‘విజయ్ ఆపరేషన్’ విజయాన్ని ఆదివారం కీర్తించారు.

జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లోని పోస్టులను ఆక్రమించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ విజయ్ ఆపరేషన్ పేరిట మట్టికరిపించింది. ఎముకలు కొరికే చలిలో -10 డిగ్రీల దగ్గర ఇండియన్ ఆర్మీ శత్రువులకు బుద్ధి చెప్పారు. కార్గిల్ సెక్టార్ ఆక్రమణ కుట్రలో భాగంగా ముందుగానే వ్యూహాత్మక పాయింట్లలో పాక్ సైన్యం మాటువేసి భారత ఆర్మీ ముందుకెళ్లకుండా గుళ్లవర్షం కురిపించినా భారత భూభాగ రక్షణలో సైన్యం ముందుకే వెళ్లింది. సుమారు రెండు నెలలపాటు జరిగిన ఈ యుద్ధంలో 527 మంది సైనికులు అమరులై 1999 జులై 26న భారత్‌కు విజయాన్ని అందించారు. దీన్ని స్మరించుకుంటూనే భారత్ ప్రతియేటా విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నది.

ఆర్మీ హాస్పిటల్‌కు రాష్ట్రపతి రూ.20 లక్షల విరాళం
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌కు రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కరోనాపై పోరును సమర్థంగా సాగించడానికి వైద్యులు, పారామెడిక్ సిబ్బందికి శ్వాసించుకోవడానికి ఉపయుక్తమైన పీఏపీఆర్ యూనిట్ల కోనుగోలుకు వినియోగించనున్నారు.

కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ప్లాన్‌లను భారత ధీశాలి సైన్యం తిప్పికొట్టిందని, వెన్నుపోటు పొడవాలని చూసిన దాయాది దేశానికి బుద్ధి చెప్పిందని ప్రధాని మోడీ కార్గిల్ వీరులను గుర్తుచేసుకున్నారు. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీరసైనికులకు నివాళులర్పిస్తూ కార్గిల్ కేవలం ఆత్మగౌరవానికి ప్రతీక మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదుర్కొనడానికి వేసిన అడుగు అని అన్నారు. భారత మాత రక్షణకు ప్రాణాలర్పించిన హీరోలపట్ల దేశం గర్విస్తున్నదని, వారి ధైర్యసాహసాలకు మోకరిల్లి నమస్కరిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.

Next Story

Most Viewed