నీట్ అర్హత పరీక్షకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

by  |
నీట్ అర్హత పరీక్షకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
X

దిశ, కరీంనగర్ సిటీ : ఎంబీబీయస్, బీడీఎస్, ఆయుష్, వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎల్జీబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో పరీక్ష రాయబోయే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుండగా, నిమిషం నిబంధన యధావిధిగా అమలు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన నిమిషం అనంతరం ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులను లోనికి అనుమతించేదిలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హాల్ టికెట్లో నిర్దేశించిన సమయానికి ముందే విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని, అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో మొత్తం 5,379 మంది విద్యార్థులు నీట్ కు హాజరుకానుండగా, పరీక్షల నిర్వహణకు అనువుగా ఉన్న నగర పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు, సీబీఎస్ఈ ప్యాటర్న్ పాఠశాలల్లో 10 కేంద్రాలు ఎంపిక చేసి, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని జ్యోతిష్మతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, బైపాస్ రోడ్ లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్థానిక జగిత్యాల రోడ్ లోని వివేకానంద డిగ్రీ అండ్ పి.జి కళాశాల, వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల ( సీబీయస్ఈ), యస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పి.జి కాలేజి, హుజురాబాద్ లోని కమల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అబ్జర్వర్లుగా నియమితులైన పలువురు అధికారులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించనున్నారు.

జిల్లాలో పరీక్ష నిర్వహణ, అవసరమైన ఏర్పాట్ల సమన్వకర్తగా నగరంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. లాలితాకుమారిని నియమించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ -19 పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వారి అడ్మిట్ కార్డులపై నిర్దేశించబడిన సమయానికి, వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, మొదటి బ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులందరూ పరీక్ష నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట తెచ్చుకొనే పాస్ పోర్ట్ సైజు ఫొటోను అతికించిన అడ్మిట్ కార్డు, మంచినీళ్ళ సీసా, శానిటైజర్, మాస్క్ లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, విద్యార్థులు సహకరించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ అధికారులు కూడా నీట్ స్పెషల్ పేర 20 నుంచి 30 బస్సుల వరకు పరీక్ష కేంద్రాల వరకు నడిపేందుకు నిర్ణయించినట్లు, రీజినల్ మేనేజర్ శ్రీధర్ వెల్లడించారు.



Next Story

Most Viewed