నలుగు రోజుల్లో ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న నాయకులు

by Disha Web Desk 16 |
నలుగు రోజుల్లో ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న నాయకులు
X
  • మా ఓటు మీకే..
  • అంతు పట్టని ఓటరు నాడి
  • గెలుపు కోసం అభ్యర్థుల ముమ్మర యత్నాలు
  • తలూపుతున్న ఓటర్లు
  • ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల భవితవ్యం

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థులకు, పార్టీ ముఖ్య నేతలకు ఓటర్ల నాడి అంతు చిక్కడం లేదు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభమైంది మొదలు.. ఇప్పటివరకు అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ప్రచారాలు చేసి ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తప్పనిసరిగా తమకు ఓటు వేస్తే.. మీ సేవలో ఉంటామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఓటర్లు మాత్రం మీకే ఓటు వేస్తామ అని వచ్చిన వారందరికీ చెబుతుండడంతో అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లు ఏ విధమైన తీర్పును ఇవ్వబోతున్నారో అన్న ఆసక్తి మొదలయ్యింది.

నాయకులు మారితే.. ఓటర్లు మారుతారా..!?

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు తమ అవసరాలు.. రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో పార్టీలు మారుతున్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ లో ఆయా మండలాలు, గ్రామాలలో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో నాయకులు, కార్యకర్తల ఒత్తిడి లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలోనూ నాయకులతో సంబంధం లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే అభ్యర్థుల గెలుపోటములలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

సమయం లేదు సోదరా..!?

పార్లమెంటు ఎన్నికలకు నేటి నుంచి మిగిలింది మూడు రోజులే.. ఈ మూడు రోజులపాటు అభ్యర్థులు ప్రధానపార్టీల క్యాడర్ ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ప్రచారాలు చేయనున్నారు. కానీ ఓటర్లు తమ ఓట్లను ఎటువైపు వేస్తారో అన్న ప్రచారం సాగుతోంది. ఒకవైపు సమయము లేదు మిత్రమా..!? అందరూ కలిసికట్టుగా పనిచేసే మన అభ్యర్థిని గెలిపించుకుందాం.. అని ఒక పార్టీ వారు అంటుంటే.. మరో పార్టీ వారు సైతం అదేవిధంగా ఆలోచనలు.. ప్రసంగాలతో ముందుకు సాగుతున్నారు.

మరింత జోరు:

ప్రచారానికి మూడు రోజులే ఉండడంతో అభ్యర్థులు మరింత జోరు పెంచుతున్నారు. నాగర్ కర్నూల్ లో భరత్ ప్రసాద్, మల్లు రవి, ప్రవీణ్ కుమార్ తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, మన్నే జీవన్ రెడ్డి తమ ప్రచార శైలిని మార్చి ప్రజలను ఆకట్టుకుని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Next Story

Most Viewed