మళ్లీ రక్తం చిందుతుందా? దేవరగట్టు కర్రల సమరంకు సర్వం సిద్ధం

by  |
మళ్లీ రక్తం చిందుతుందా?  దేవరగట్టు కర్రల సమరంకు సర్వం సిద్ధం
X

దిశ, రాయలసీమ: కరోనా కల్లోలంలో కూడా చెలరేగే కర్రల యుద్ధం! రక్తతర్పణంతోనే దేవర శాంతిస్తాడనే తరతరాల అంధ విశ్వాసం! ఈసారి కూడా టెంకాయల్లా తలలు పగలాల్సిందేనా? కర్రల సమరం మాటున ఫ్యాక్షన్‌ పడగ విప్పే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉత్సవ కమిటీ సమావేశం అయ్యింది.

కళ్లలో భక్తి… కర్రల్లో పౌరుషం… వెరసి రక్తాభిషేకం..! అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం..! ప్రతీ ఏటా భక్తి పేరుతో విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. కర్రలు నృత్యం చేస్తాయి. దసరా అంటే దేశమంతా సంబురం. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం సమరం. ఒళ్లు విరుచుకునే వీరావేశం! పూనకంతో తలలు బద్దలు కొట్టుకునే ఆచారం. అందుకు ఈ ఏడాది కూడా అతీతం కాదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని నిర్వాహకులు కొనసాగిస్తామంటున్నారు. ఈక్రమంలోనే.. ఈసారి బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు.

ప్రతీ ఏటా మాదిరిగానే ఈసారి కూడా బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్రలతో తలపడే ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, ఎలాంటి రక్తపాతాలకు తావులేకుండా జరుపుకోవాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు. ఉత్సవంలో ఎవరూ రింగు కర్రలు వాడవద్దని, ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు శ్రీ కన్యాకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాలు (కర్రల సమరం) నిర్వహణపై అధికారులు సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఆదోని డీఎస్పీ, ఆర్డీవో, పోలీసులు,రెవెన్యూ అధికారులతో పాటు మరో 10 శాఖల సిబ్బంది హాజరయ్యారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బన్నీ ఉత్సవాల్లో (కర్రల సమరంలో) పాల్గొనే వివిధ గ్రామాల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయం ప్రకారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.

కర్రల సమరం వద్దని పోలీసులు..సంప్రదాయమని నిర్వాహకులు..ఇలా దేవరగట్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతా విజయదశమి సంబురాల్లో మునిగితేలుతుంటే… దశాబ్దాలుగా దేవరగట్టులో మాత్రం సమరం కొనసాగుతోంది. బన్నీ ఉత్సవంలో రక్తం పారుతోంది. తలలు పగిలి ప్రాణాల మీదకు తెచ్చే ఈ బన్నీ ఉత్సవం ఈసారైనా ఆగుతుందా? పోలీసులు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతాయా? అసలు ఈసారి దేవరగట్టులో ఏం జరుగబోతోంది.? అన్న అంశం టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది.

కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవానికి పెద్ద చరిత్రే ఉంది. దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది సమరానికి సై అంటారు. దేవరగట్టుకొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు అర్థరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వస్వామికి కళ్యాణం జరుగుతుంది. అనంత మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ విగ్రహాలకు మూడు గ్రామాల ప్రజలు రక్షణగా నిలుస్తారు. ఒక వర్గం వారు విగ్రహాల్ని తీసుకు వెళ్తుంటే.. మరో వర్గం వారిని ఆపే ప్రయత్నం చేస్తారు.ఇలా రెండు వర్గాల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాల్ని తిరిగి దేవరగట్టు మీద ఉంచటంతో ఉత్సవం పూర్తి అవుతుంది. ఇందులో వందలాది మంది తలలు పగులుతాయి. అయినా లెక్క చేయకుండా కర్రల సమరానికి సై అంటారు.


Next Story

Most Viewed