ఎందెందు చూసినా ‘కరోనా’ అందందు

by  |
ఎందెందు చూసినా ‘కరోనా’ అందందు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ హైదరాబాద్‌ను భయపెడుతోంది. కరోనా నివారణకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. 15 రోజులు సెలవులు రావడంతో పిల్లలతో సహా ఊళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నా ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తోంది. ఓ వైపు కరోనా భయాలు.. సెలవులు.. ఎండల తీవ్రత వెరసి సిటీ రోడ్లపై రద్దీ తీవ్రత తగ్గుతోంది.

కరోనా ప్రభావం నేపథ్యంలో జిల్లాల పరిధిలో ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలతో తల్లిదండ్రులకు తీరికలేకుండా పోయింది. పార్కులు, సినిమా హాళ్లు కూడా మూతపడటంతో వారిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, స్విమ్మింగ్ పూల్స్‌కు ఆదివారం నుంచే తాళాలు వేయడంతో సెలవులు వచ్చినా కుటుంబంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ప్రైవేటు విద్యాసంస్థలు, స్టడీ సెంటర్లు మూతపడ్డాయి.

విద్యాసంస్థలు మూసివేయడంతో యాజమాన్యాలకు ఎలాంటి నష్టం లేదు. ముందుగానే విద్యార్థుల నుంచి ఫీజలు వసూలు చేసి ఉన్నారు. అందులో పనిచేసే కింది స్థాయి సిబ్బంది, రోజూ పాఠశాలలకు తీసుకెళ్లే ఆటోలు, స్కూల్ బస్సుల డ్రైవర్లకు మాత్రం 15 రోజుల జీతం చెల్లించకపోవడంతో వారు నష్టపోతున్నారు. సినిమాహాళ్లు, బార్లలో పనిచేసే సప్లయ్ బాయ్స్, క్లీనింగ్ పనులు చేసే రోజువారీ లేబర్ ఉపాధి కోల్పోతున్నారు. వారికి రోజు లెక్క ఇచ్చే విధానం ఉండటంతో వారికి ఆదాయం లేకుండాపోతుంది. వీటిపై ఆధారపడి బతికే చిరువ్యాపారులు కూడా నష్టపోతున్నారు. సినిమా థియేటర్ల షో ఆదాయమే కొన్ని కోట్లలో ఉంటుంది. వైన్స్ నడుస్తున్నాయి. కొన్ని చోట్ల పర్మిట్ రూంలను కూడా మూసివేశారు. మద్యం తాగే వారికి చిరుధాన్యాలు, కావాల్సిన ఇతర ఆహార పదార్థాలు అమ్ముకునేవారికి ఉపాధి లేకుండా పోయింది. మెట్రోల్లో నిత్యం 4 లక్షల మంది ప్రయాణించేవారు. కరోనాపై ప్రభుత్వ ప్రకటన తర్వాత మెట్రోల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేవారి సంఖ్య తగ్గినట్టు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మాస్కులు ధరించిన ఆర్టీసీ సిబ్బంది, సాధారణ ప్రజలు కనిపిస్తున్నారు.

సూపర్ మార్కెట్లలో లేని కరోనా భయాలు

నగరంలోని పార్కులు, సినిమాహాళ్లు, సందర్శక ప్రాంతాల్లో కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. రీటైల్ మార్కెట్లలో మాత్రం ఈ ప్రభావం కనిపించడం లేదు. నిత్యవసర వస్తువులతోపాటు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అందించేలా ఉన్న రిటైల్, హైపర్ మార్కెట్లు నగరంలో పలుచోట్ల ఉన్నాయి. డీ మార్ట్, బిగ్‌బజార్, స్పెన్షర్, మోర్ తెరిచి ఉంచడంతో షాపింగ్ కోసం వచ్చేవారి సంఖ్యలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కుటుంబాలతో సహా గడిపించేందుకు ఐస్‌క్రీం పార్లర్లు, బేకరి ఫుడ్‌కోర్టులు కూడా కొన్ని మాల్స్‌లో ఉండటంతో పిల్లలుసహా ఇంటి కోసం కావాల్సిన వస్తువులను కొనుగోళ్లు చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. సెలవు రోజులకు అవసరమైన అన్ని సరుకులు తీసుకుని ఊర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఐటీ కంపెనీలతోపాటు పలు ప్రముఖ సంస్థలు సైతం ‘వర్క్ ఫ్రమ్ హోం ’ ఆఫర్ చేస్తుండటంతో రెస్టారెంట్లు, ప్రజా రవాణా వ్యవస్థలకు తాకిడి తగ్గింది. రోడ్లపైన ఆటోలు, కార్ల సంఖ్య కూడా తగ్గింది.

Tags : Corona, hyderabad, rtc, metro, shopping, holidays

Next Story

Most Viewed