కేసీఆర్ ఇలాఖాలో రోడ్ల మీదే పీపీఈ కిట్లు

by  |
కేసీఆర్ ఇలాఖాలో రోడ్ల మీదే పీపీఈ కిట్లు
X

దిశ ప్రతినిధి, మెదక్ : కాస్త అజాగ్రత్తగా ఉన్నా కరోనా సోకే ప్రమాదముందని అధికారులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. కొంచెం నిర్లక్ష్యం వహించినా వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో రోజురోజుకూ కరోనా వ్యాధి ఎక్కువవుతోంది. దీని బారిన పడకుండా చాలా మంది వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ కొందరి నిర్లక్ష్యం అనేక మందిలో భయాన్ని కలిగిస్తున్నది. రోగులు, కరోనా ఫ్రంట్ వారియర్స్ వారిన పీపీఈ కిట్లను కాల్చేయకుండా రోడ్లపైనే ఇష్టానుసారంగా పారేస్తున్నారు. దీంతో ఇవి ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇవి గాలికి జనావాసాల్లోకి కొట్టుకొస్తుండటంతోనే స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సిద్దిపేట-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై రోడ్డుకిరువైపులా వాడేసిన పీపీఈ కిట్లు కనిపిస్తున్నాయి. వీటిని ఎవరు పడేశారో తెలియదు కానీ గజ్వేల్ నియోజకవర్గం వంటిమామిడి నుంచి శామీర్‌పేట వరకు ఇలాంటి పీపీఈ కిట్లు రోడ్లు పక్కనే కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి వల్ల ఇవి తమ నివాసప్రాంతాల వైపు కొట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొంత మంది నిర్లక్ష్యం కారణంగా వైరస్ తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని వారు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఎవరు ఇక్కడ పాడేస్తున్నారో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. దీనిపై జిల్లా కొవిడ్ వైద్యాధికారి పవన్‌కుమార్ రెడ్డిని వివరణ కోరగా అలాంటివేవి తమ దృష్టికి రాలేదంటూ సమాధానమిచ్చారు.



Next Story

Most Viewed