బతుకు బండి నడిచేదెట్లా !

by  |
బతుకు బండి నడిచేదెట్లా !
X

దిశ, మహబూబ్‌నగర్‌: అసలే రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు.. అరకొర వేతనాలు. ఒక రోజు పని దొరికితే మరో రోజు ఉండదు, ఇది దినసరి కూలీల పరిస్థితి. ఇంకో వైపు బండి చ్రకం తిరిగితే తప్ప బతుకు చ్రకం నడవని పరిస్థితి ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారిది. ఇలాంటి సందర్భంలో అనుకొని విపత్తు వారి జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రస్తుతం కోవిడ్- 19తో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లి కూలీ చేసుకునే వారితో పాటు వాహనాలపై అధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి కష్టంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు రోడెక్కె పరిస్థితి లేకపోవడంతో ఖర్చులు కూడా ఎల్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆటో వాలాలు వాపోతున్నారు. కొందరికి రేషన్ కార్డులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న చేయూత అందుకునేట్లు లేదు.

అధికారుల లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 3,650, నాగర్‌కర్నూలులో 2,600, వనపర్తిలో 1,830, జోగుళాంబ గద్వాలలో 2,650, నారాయణపేటలో 1,620 వరకు ఆటోలు నడుస్తున్నాయి. వీటిపై అధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ లాక్‌డౌన్‌తో పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల వారు రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడడంతో కొనుగోళ్ళు పూర్తిగా స్తంభించిపోయాయి. అదే సమయంలో దినసరి కూలీలకు పనులు లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి నెలకుంది.

ప్రస్తుతం భవన నిర్మాణ రంగం కూడా కుదేలవ్వడంతో కూలీ పనులు దొరికే పరిస్థితులు లేవు. వ్యాపార సంస్థలు కూడా మూతపడడంతో భవన నిర్మాణానికి కావాల్సిన వస్తువులు కూడా అందుబాటులో లేకపోవడం, సామాజిక దూరం నిబంధనలను ప్రభుత్వం అమలు చేయడంతో నిర్మాణాలు పూర్తిగా నిలిచి పోయాయి. దీంతో లాక్‌డౌన్ ప్రభావం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మేస్ర్తీలు, కూలీలను కలుపుకుని సుమారు 2.5లక్షల మందిపై పడటంతో పేద కుటుంబాలకు బతుకు బండిని నడపడం కష్టంగా మారుతోంది.

Tags: Corona Effect, Lockdown, Auto, Taxis, Towns, Rural Areas, Problems of poor people, Social Distance

Next Story

Most Viewed