ఆకలేస్తే.. అటు అడుగులేస్తే!

by  |
ఆకలేస్తే.. అటు అడుగులేస్తే!
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌‌డౌన్ ఇబ్బందులను ఎదుర్కునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వలస, దినసరి కూలీలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సొంత రాష్ట్ర ప్రజలనే కాదు.. ఎక్కడి నుంచి వచ్చినవారైనా కడుపులో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ, వాస్తవంలో పేదలకు తిండి దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, నాయకులతో కిటకిటలాడాల్సిన రాజ్‌భవన్ పరిసరాలు.. ఆకలి కోసం అలమటిస్తున్న పేదలతో నిండిపోతున్నాయి. వారిని సామాజిక దూరం పాటించేలా చేయడం పోలీసు అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది.

పేదల ఆకలి తీర్చేందుకు సామాజిక సంస్థలు, వ్యక్తులు తమ వంతు సాయాన్ని చేస్తున్నారు. అయితే ఆకలితో ఉన్న పేదలు ఇంకా చాలామందే ఉన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్కరో, ఇద్దరో అంటే సమస్య అంత తీవ్రంగా ఉండేది కాదేమో కానీ.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోనే నిత్యం వందల మంది పేదలు తమ జానెడు పొట్ట నింపుకునేందుకు బారులు తీరుతున్నారు.

గత 19 రోజులుగా రాజ్‌భవన్ ముందు రోజు మధ్యాహ్నం భోజనం కోసం పేద ప్రజలు లైన్లలో నిలబడుతున్నారు.

లాక్‌డౌన్ తెచ్చిన ఇబ్బందులతో…

లాక్‌డౌన్ తెచ్చిన ఇబ్బందులతో సొంతంగా కడుపు నింపుకోలేక వీరంతా రాజ్‌భవన్ ఏర్పాటు చేసిన ఉచిత భోజనాన్ని నమ్ముకున్నారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండనవసరం లేకుండా కడుపు నింపుతామన్న ముఖ్యమంత్రి మాటలను గవర్నర్ అధికారిక భవనం ముందు బారులు తీరిన ఈ పేదల ఆకలి వెక్కిరిస్తోంది. ప్రారంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు ఇక్కడికొచ్చే పేదల సంఖ్య మరింత పెరిగింది. రాజ్‌భవన్ వర్గాల మానవతా హృదయమే వారికి బాసటగా నిలుస్తోంది తప్ప ప్రభుత్వం చెబుతున్న మాటలు కాదు. ఇలాంటి ఘటనలు చూసైనా ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు పటిష్టమైన వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరముంది.

సామాజిక దూరమే సమస్య..

ఏప్రిల్ మొదటి నుంచి ఇక్కడ భోజనాన్ని అందించే ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రోజుకు సగటున 200 మంది భోజనాలు తినడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. ఆకలితో అలమటించే కడుపులు మాడేలా రోజులు, చెమటలు కారేలా దంచికొడుతున్న ఎండలు వారిని అన్నం పొట్లాల వేటలో సవాల్ విసురుతున్నాయి. ఎలాగైనా భోజనం దక్కించుకుంటేనే ఆ పూట కొంచెం ఉపశమనం. జనాల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో అన్నం కోసం వారి మధ్య పోటీ నెలకొంటుంది. ఎలాగైనా అన్నం దక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు తోసుకుంటూ వస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కష్టంగా మారింది. సామాజిక దూరాన్ని అమలు చేయించేందుకు మొదట్లో ప్రయత్నం చేసినా.. ఇప్పుడు ఆ పనిచేసినా ఫలితం కనిపించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించేలా చేయడం పోలీసులకు ఓ పెద్ద ప్రహసనంగా మారిపోయింది. లైన్‌లో వస్తే అక్కడికి తాము ఎప్పుడో వస్తామో.. అక్కడికొచ్చినంక అప్పుడు అన్నం ఉంటదో లేదోననే ఆందోళన పేదల్లోనూ.. కరోనా ఎవరికైనా ఉంటే ఎంత ప్రమాదమనే భయం పోలీసుల్లోనూ కనిపిస్తోంది.

Tags: LCR, lockdown, corona, Rajbhavan, poor, meals



Next Story

Most Viewed