TRS ఓవర్ లోడ్.. కేసీఆర్‌‌కు మాజీ ఎంపీలు భారీ షాక్ ఇవ్వబోతున్నారా?

by GSrikanth |
TRS ఓవర్ లోడ్.. కేసీఆర్‌‌కు మాజీ ఎంపీలు భారీ షాక్ ఇవ్వబోతున్నారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇతర పార్టీ నేతల చేరికలతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవర్ లోడ్ అయింది. దీంతో ఏర్పడుతున్న అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రోజు రోజుకూ అధికార పార్టీలో పెరిగిపోతున్న అసమ్మతి రాగాలు అధినేత కేసీఆర్‌కు కొత్త తలనొప్పిగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ దూకుడుతో సీఎం కేసీఆర్ సతమతం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కారు పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు చేసిన చేసిన కామెంట్స్ టీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరి మాటల వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలియక అధికార పార్టీ నేతలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌కు గులాబీ కింద ముళ్లల గుచ్చుకుంటున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

తొందర వద్దు.. త్వరలోనే మంచి కాలం:

ఖమ్మం టీఆర్ఎస్‌లో చాలా కాలంగా వర్గపోరు గుప్పుమంటోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం కూడా చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూ వస్తున్నా ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన అనుచరులు ఎవరూ తొందర పడవద్దని, త్వరలో భగవంతుడే మంచి మార్గం చూపిస్తాడని ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో ఆయన చేసిన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ శీనన్న.. ఇంకేంటి అనే ఉత్కంఠ ఎవరికి వద్దని అలాగే మీ వెంట నడిచే వారిలోనూ ఇలాంటి ఉత్కంఠలే తీసుకురావొద్దని సూచించారు. కాలం, సందర్భం అన్ని ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని మనం ఉరికి ఉరికి బోర్లపడాల్సిన పని లేదన్నారు. మీ గుండెల్లో మంచి స్థానం ఇచ్చిన ఆ భగవంతుడే మనందరికీ మంచి మార్గం చూపిస్తాడని త్వరలోనే మంచి ఫలితం రానుందని ఇందులో తనను నమ్ముకున్న వారందరికీ వాటా ఉంటుందని అన్నారు. పొంగులేటి మాటల వెనుక గూఢార్థం ఏంటనేది టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. పొంగులేటి కూతురు వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి అధికార పార్టీ నేతల కంటే బీజేపీ నేతలే ఎక్కువగా హాజరయ్యారనే టాక్ వినిపిస్తోంది. తన కూతురు మ్యారేజ్ తర్వాత ఆయన తిరిగి పాలిటిక్స్‌లో మరింత యాక్టీవ్ అయిపోయారు. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ పొంగులేటికి ఆశ చూపి మోసం చేశారని అందువల్ల అనువైన సమయం చూసుకుని పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారడం లేదని చెబుతూనే త్వరలో మంచి కాలం వస్తుందని కామెంట్స్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం:

ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఫీవర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ఇక్కడ ఏ పార్టీ గెలవనుందనే ఉత్కంఠ అన్ని చోట్ల ఉంది. ఈ స్థానాన్ని తప్పక గెలిచి రాబోయే ఎన్నికలకు మరింత కాన్ఫిడెంట్‌గా వెళ్లాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆశలకు సొంత పార్టీ నేతల తిరుగుబాటు షాక్ ఇస్తోందట. తాజాగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాక మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యక్రమాల సమాచారం తనకు, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌కు ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ అంశంపై సమాధానం చెప్పాలని బూర నర్సయ్య డిమాండ్ చేయడం కారు పార్టీలో కలకలం రేపుతోంది. బీసీ సామాజిక వర్గం డిసిషన్ మేకర్స్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ నేతలను కలుపుకు పోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పార్టీ నేతలు వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమగా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడుతామని చెబుతూనే బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలనే బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఒకే రోజు టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ లు చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ మాటల వెనుక నేతల ఆవేదన ఉందా లేక పార్టీ మారేందుకు అనువైన సమయం వచ్చిందని భావిస్తున్నారా అనేది అంతుచిక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story