పోలీసులు దారుణంగా హింసించారు.. పట్టాభి

by Dishafeatures2 |
పోలీసులు దారుణంగా హింసించారు.. పట్టాభి
X

దిశ, ఏపీ బ్యూరో: సోమవారం సాయంత్రం 6 గంటలకు కొమ్మారెడ్డి పట్టాభిని గన్నవరం జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం పట్టాభిరామ్‌ను గన్నవరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులోపలికి వెళ్లేముందు పట్టాభి కమిలిపోయిన అరచేతులను చూపించారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు పట్టాభిని అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని ఆరోపించారు. అయితే సోమవారం వైసీపీ మూకలు ఆయనపై దాడికి తెగబడ్డాయి. ఆయన కారును ధ్వంసం చేశాయి. అదే కారులో ఉన్న పట్టాభి డ్రైవర్‌, పీఏ, గన్‌మెన్‌ను దించివేసి.. పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. ఫోన్‌ను స్విచాఫ్‌ చేశారు. రాత్రి 11 గంటలైనా ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పలేదు. తన భర్తను ఏమైనా చేస్తారేమోనని పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభితో పాటు మరో 16మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.

ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా?.. పట్టాభి భార్య చందన

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భార్య చందనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్‌కు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కాగా తన భర్త కొమ్మారెడ్డి పట్టాభి సోమవారం సాయంత్రం నుంచి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది అని చందన తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా? అంటూ మండిపడ్డారు. మరోవైపు సోమవారం సాయంత్రం నుంచి తన భర్త పట్టాభి కనిపించడం లేదని భార్య చంద రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. పోలీసులు గన్నవరం వెళ్ళనివ్వడం లేదు కాబట్టి ఇంటి దగ్గర పడమట సిఐ కాశీ విశ్వనాధ్‌కు చందన ఫిర్యాదు లెటర్ అందజేశారు.


జగన్ సైకోయిజానికి ఎవ్వరూ భయపడరు.. మాజీ మంత్రి దేవినేని ఉమా

పులి వెందుల అరాచకాన్ని కృష్ణా జిల్లాకు జగన్ చూపించారని, రాష్ట్రంలో పరిపాలన, చట్టం లేదని శాచిక ఆనందంతో పట్టాభిని పోలీసులు తిప్పుతున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఎం జగన్ సైకోయిజానికి ఎవ్వరూ భయపడటం లేదన్నారు. పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్ చూపించారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఘటనకు పూర్తిగా జగన్ రెడ్డి , వల్లభనేని వంశీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బోడే ప్రసాద్ ను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని, కార్యకర్తలను, నాయకులను లాక్కెళ్లారని ఆరోపించారు.


Next Story

Most Viewed