మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి మార్ఫింగ్ వీడియోతో కాదు : మంత్రి ఆర్‌కే రోజా

by Disha Web Desk 16 |
మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి మార్ఫింగ్ వీడియోతో కాదు : మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని మంత్రి రోజా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు టీడీపీ ఎంతలా దిగజారిందో అనడానికి ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఐటీడీపీ అంటే అది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం అని మంత్రి రోజా ఆరోపించారు. అందులో ఒక మార్ఫింగ్ వీడియోను అప్‌లోడ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ ప్రభుత్వాన్ని, ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నించింది అని మంత్రి రోజా ఆరోపించారు.

మేనిఫెస్టోతో రాజకీయం చేయాలే తప్ప మార్ఫింగ్‌ వీడియోతో రాజకీయం చేయడం టీడీపీకే చెల్లింది అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని ఈరోజు ప్రజలంతా అనుకుంటున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. జగన్ లాంటి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం తమ అదృష్టమని రాష్ట్రంలోని మహిళలు భావిస్తున్నారని అందులో భాగంగానే వారంతా జగన్‌కు అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది ఓర్వలేకనే టీడీపీ మార్ఫింగ్ వీడియోలతో దిగజారుడు రాజకీయం చేస్తోందని మంత్రి రోజా మండిపడ్డారు. దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

ఈ మహిళామణులంతా అప్పుడేమైపోయారు

విజయవాడలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ మహిళా నేతలపై రోజా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. 44లక్షల మంది మహిళలకు అమ్మఒడి ఇస్తున్నందుకా..? 78 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నందుకా?, 25లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నందుకా? 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకా? మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్లను తీసుకువచ్చినందుకా సస్పెండ్ చేయాలా అని మంత్రి రోజా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన ఘోరాలపై రోజా గుర్తు చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో అమాయకపు ఆడవాళ్లను వ్యభిచార కూపంలో నెట్టుతుంటే తాము పోరాడాం. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులైన బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్‌లను వంగలపూడి అనిత వెనకేసుకు రాలేదా అని రోజా ప్రశ్నించారు. వారిని ఎందుకు వంగలపూడి అనిత సస్పెండ్ చేయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్ నాడు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినప్పుడు ఈ వంగలపూడి అనిత, మహిళా మణులంతా ఏమైపోయారని మంత్రి రోజా నిలదీశారు. వనజాక్షి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి తనకు రక్షణ కల్పించాలని రోడ్డుపై కూర్చుని ఏడిస్తే కనీసం చింతమనేనని సస్పెండ్ చేయించగలిగారా..? ఈ రోజే మీరు ఫేక్ వీడియో సృష్టించి మీరే అప్‌లోడ్ చేసి సీఎం జగన్‌పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా దుష్ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు.

ఆడవాళ్లకు అన్యాయం జరిగినప్పుడు బయటకు రాని మీరు మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై అన్యాయంగా విమర్శలు చేస్తే ప్రజలే భవిష్యత్‌లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలతో.. పిచ్చిపిచ్చి ప్రెస్‌మీటలతో రెచ్చిపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని రోజా కొనియాడారు. తన చెల్లిని, తల్లిని, కూతుళ్లను ఏ విధంగా గౌరవిస్తారో రాష్ట్రంలోని మహిళలను అదే విధంగా గౌరవిస్తారు అని రోజా చెప్పుకొచ్చారు. మహిళలను అంతలా గౌరవిస్తున్నారు కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అండగా నిలుస్తున్నారని అన్నారు. మార్ఫింగ్ వీడియోలతో మాపై దుష్ప్రచారం చేస్తే ఎంతదూరమైనా వెళ్లి తగిన గుణపాఠం చెప్తామని మంత్రి రోజా హెచ్చరించారు.

Next Story

Most Viewed