ఉప ఎన్నిక వేళ కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. ఆ పార్టీల సపోర్ట్‌తో రంగంలోకి ఆర్టీసీ

by Disha Web Desk 2 |
ఉప ఎన్నిక వేళ కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. ఆ పార్టీల సపోర్ట్‌తో రంగంలోకి ఆర్టీసీ
X

దిశ, చౌటుప్పల్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సహకారంతో సకల జనుల సమ్మె విజయవంతంగా నడిపారు. కానీ, ఇప్పుడు ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండకూడదని మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘకాలం సమ్మె నిర్వహించారు. సమ్మె అనంతరం డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి అనేక హామీలు ఇచ్చి అందులో అత్యధిక అమలు చేయలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే ఆర్టీసీ కార్మికులు పోరుకు సిద్ధమైన కొన్ని అనివార్య కారణాలతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు త్వరలో మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరుబాటకు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈనెల 18న చౌటుప్పల్లో రిటైరయిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనవి

ఆర్టీసీలో రెండు సంవత్సరాల పాటు కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించకూడదని మౌఖిక ఆదేశాలు ఇచ్చి రెండు సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించకుండా వాటి స్థానాల్లో సంక్షేమ మండలి ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు ఇచ్చారని కార్మికులు తెలుపుతున్నారు. కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంకా కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతించడం లేదని వెంటనే కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిపాలని కోరుతున్నారు.

* ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా 2017లో 16 శాతం ఐఆర్ ఇచ్చి ఇప్పటివరకు వేతన ఒప్పందం చేయలేదని రెండు వేతన సవరణలు అమలు కావాల్సి ఉందని వాటిని వెంటనే అమలు చేయాలని అన్నారు.

* జనవరి 2020 నుండి ఇప్పటివరకు రావాల్సిన ఆరు డీఏలు, 2013 వేతనసవరణకు సంబంధించి 50 శాతం ఎరియర్స్ పై 5 సంవత్సరాల కాలపరిమితితో వడ్డీ బాండ్స్ డబ్బులు చెల్లించాలి.

* ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలన్నారు.

* రిటైర్ అయిన కార్మికుల సెటిల్మెంట్ డబ్బులతో పాటు సకల జనుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి.

* రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆఫ్ డ్యూటీలను రద్దు చేస్తూ సింగిల్ క్రూ డ్యూటీలుగా మారుస్తున్నారు. ఇలా మార్చడం వల్ల ప్రతిరోజు మహిళా కండక్టర్‌లు 13 నుంచి 14 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. కావున వీటిని మార్చి చట్టపరిధిలో డ్యూటీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు.

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ డెడ్ లైన్

పైన పేర్కొన్న డిమాండ్ల పరిష్కారం కోసం మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ లోపు చొరవచూపకుంటే తాము పోరుబాటకు సిద్ధం అవుతామని ఆర్టీసీ కార్మికులు 'దిశ'తో తెలిపారు. అంతేకాకుండా చౌటుప్పల్‌లో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానట్లయితే మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మినహా ఇతర పార్టీల మద్దతుతో పోటీ చేయాలనే ఆలోచనలో ఆర్టీసీ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఇప్పటికే వీఆర్ఏలు,లారీ యజమానులు, నర్సులు, మిర్యాలగూడ జిల్లా సాధన సమితి, చర్లగూడెం, కిష్టరాయన్ పల్లి భూనిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి సై అన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్టీసీ కార్మికులు కూడా అటువైపు ఆలోచన చేయడంతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి అన్ని వర్గాలు సిద్ధమైనట్లు సమాచారం.

పార్టీ మార్పుపై టీడీపీ నేత క్లారిటీ..



Next Story

Most Viewed