పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, బడంగ్​పేట్​: గత కాంగ్రెస్​ ప్రభుత్వం పేదోడికి పంచిన భూములను దోపిడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు తమ పోరాటం ఆగదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్​పేట్, నాదర్​గూల్, అల్మాస్​గూడ, మామిడిపల్లి ప్రాంతాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వం 4 వేల మంది పేదలకు ఇచ్చినా ఇండ్ల స్థలాలను కేసీఆర్​ ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించాలని సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడ కమాన్ నుంచి నాదర్ గుల్ వరకు కొనసాగింది.


ఈ సందర్భంగా సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నిశ్శబ్దంగా రాజ్య హింసకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ ధమనకాండ పై ప్రజాసంఘాలు, సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు పేదలకు అండగా నిలబడేవని, కానీ ఇప్పుడు పేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్న ఏ ఒక్కరు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజ్య హింసపై మేధావులు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున బీఆర్ఎస్ సర్కార్ రాజ్య హింసకు పాల్పడుతుందన్నారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇండ్లు ఇవ్వకపోగా, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి లాక్కుంటున్నారని మండిపడ్డారు.

ఇబ్రహీంపట్నంలో ఐదు లక్షల కోట్ల విలువైన పదివేల ఎకరాలను లాక్కొన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఐదు లక్షల కోట్ల విలువైన పదివేల ఎకరాలను ఈ ప్రభుత్వం పేదలను భయపెట్టి బలవంతంగా గుంజుకున్నదని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ రూ. 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం గుంజుకున్నది ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర అని అన్నారు. పేదల నుంచి గుంజుకున్నా భూములను సంపన్న వర్గాలకు కంపెనీలకు, హెచ్ఎండిఏ లే అవుట్ చేయడానికి కేటాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. గత ప్రభుత్వాలు హక్కుగా ఇచ్చిన భూములను లాక్కునే హక్కు ఎవరికీ లేదని, వచ్చే జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయని,. మీ భూముల్లో మీరు అరక పట్టి దుక్కి దున్నుకొని పంట పండించుకోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మీకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి సమాయత్తం కావాలని, ఎవరు అడ్డు వస్తారో చూస్తామని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుర్మల్​ గూడలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన 4వేల ఇండ్లను రెండు నెలల్లో పేదలకు పంపిణీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలను ఇండ్ల వద్దకు తీసుకువెళ్లి గృహప్రవేశం చేపిస్తామన్నారు. మహేశ్వరం మండలంలో ఫార్మాసిటీ కంపెనీ కోసం తెలంగాణ ప్రభుత్వం 500 ఎకరాలను లాక్కోవడంతోపాటు మరో 400 ఎకరాలను బఫర్ జోన్లో పెట్టిందని ఆరోపించారు. వెయ్యి ఎకరాలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 2023 - 24లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చేంత వరకు మీ భూములు దోపిడీ కాకుండా మీరే కాపాడుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు, మీడియా, సామాజిక బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాలని కోరారు.

దగా చేయడానికే ధరణిని తీసుకువచ్చిన కేసీఆర్​ : ప్రజాయుద్ధ నౌక గద్దర్

200 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలు కాపాడుకుంటున్న భూములను వారికి లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ దగా చేయడానికి ధరణి తీసుకొచ్చారని ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆరోపించారు. రాష్ట్రంలో కేసిఆర్ పాలన కట్టింది కూల కొట్టు, కమిషన్లు కొట్టు, ఎన్నికల్లో పంచి పెట్టు, గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన పత్రికలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారికి హక్కుగా ఉన్న ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల విప్లవం రావలసిన సమయం ఆసన్నమైందని, కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వివరించి చైతన్య పరిచి కేసీఆర్ ప్రభుత్వం గద్దె దింపే విధంగా ఓట్లు పోలరైజ్ చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్లు లేకుండా పోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై. అమరేందర్ రెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed