బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఈటల క్లారిటీ..

by Disha Web Desk 11 |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఈటల క్లారిటీ..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్/ శామీర్ పేట: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు అధ్యక్షుడి మార్పు ఉండదని తేల్చిచెప్పారు. తనకు అధ్యక్ష పదవి ఇవ్వరని, అలాంటి అవకాశం లేదని స్పష్టంచేశారు. బుధవారం శామీర్ పేటలోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చరని తెలిపారు. బండి సంజయ్ తన శక్తి మేరకు పనిచేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చన్నారు.

తనను ఎలా ఉపయోగించుకోవాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందన్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని నోరు తెరిచి అడిగే వ్యక్తిని కాదన్నారు. తనకు ఏ బాధ్యత ఇవ్వాలనేది ఢిల్లీ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలువాలంటే మా శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల బలం పెంచుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలను రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అందరిని భాగస్వామ్యం చేయాలన్నారు.

జీవోను వెనక్కి తీసుకో...

తెలంగాణ కేబినెట్ ఇటీవల 111 జీవోను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఈటల స్పందించారు. 111 జీవో రద్దుతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రైతుకు మేలు జరిగేది ఏమీ లేదన్నారు. 111జీవోలో ఉన్న భూములు ఆంధ్ర వ్యాపారులు కొల్లగొడుతున్నారని గతంలో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి మాటున రైతుల పొట్టగొడుతూ 111 జీవోను కేసీఆర్ రద్దు చేశారని మండి పడ్డారు.

ధరణితో తిప్పలు..

కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతుల కొంపలు ముంచిందని దుయ్యబట్టారు. ధరణి సమస్యల వల్ల రైతులు ఆగం అవుతున్నారని చెప్పారు. ధరణిలో 18లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని వివరించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వాలేదని విమర్శించారు. రింగ్ రోడ్ చుట్టుపక్కన ఉన్న దళిత రైతుల 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎకరాకు 300 గజాలు ఇచ్చి పేదల భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులకు పోలేక రైతులు బ్రోకర్లకు భూములు అమ్ముకునే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. ధరణితో కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ధరణిలో వివాదాస్పద భూములకు ఎందుకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ సొమ్ముతో...

తెలంగాణ ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సొమ్ముతోనే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ప్రతినిధులకు స్థానం లేదు, మీడియాకు స్థానం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరిక వ్యవస్థనా కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed