సమస్యలు తీరాలంటే ప్రభుత్వం మారాలి: వైఎస్ షర్మిల

by Disha Web Desk 11 |
సమస్యలు తీరాలంటే ప్రభుత్వం మారాలి: వైఎస్ షర్మిల
X

దిశ, షాద్ నగర్: రాష్ట్ర ప్రజల సమస్యలు తీరాలంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ పనులు చేపట్టాలని కోరుతూ అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మహా ధర్నాలో బీజేపీ, బీఆర్ఎస్, మినహా అన్నీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ గత పది ఏళ్లలో ఇక్కడ ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కమీషన్ల కోసం తప్ప రాష్ట్రాన్ని దేనికోసం వాడుకోవడం లేదని విమర్శించారు. రీడిజైన్ చేయడం మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు ఇవ్వడం కమీషన్లు నొక్కేయడం ఇదే దందాగా మారిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు దేశం మీద పడ్డారని అన్నారు.

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ షాద్ నగర్ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చేందుకు ప్రాజెక్టును కట్టకుండా ఆలస్యం చేశారని విమర్శించారు. ఇక్కడి డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టి దానిని లక్షల కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేశారని ఆరోపించారు. శతాబ్దాల క్రితం నుండి జలవనరుల విషయంలో ప్రజలు, రైతులే ఇంజనీర్లుగా వ్యవహరించి నీళ్లను సాధించుకున్నారన్న విషయం మరవద్దని అన్నారు. నీటి కేటాయింపులు తెలంగాణకు 35% ఆంధ్రకు 65% అంటూ ఏ ప్రాతిపదికన పెద్దలు మాట్లాడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జూరాల నుండి లక్ష్మీదేవి పల్లికి నీటిని కేటాయిస్తే పోయేదని కానీ శ్రీశైలం నుండి డిజైనింగ్ చేయించి ఆ తర్వాత దానిని కూడా విస్మరించారని అన్నారు. కావాలని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే యుద్ద ప్రాతిపదికన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed