మోడీ, అమిత్ షా లపై కామెంట్స్.. వివాదంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త!

by Disha Web Desk 2 |
మోడీ, అమిత్ షా లపై కామెంట్స్.. వివాదంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయమైన, వ్యాపారమైన చివరకు అది క్రీడలైన సమిష్టి కృషితోనే విజయాలు దక్కుతాయి. కానీ, ఆ విజయాలను కొంత మంది ఖాతాలో వేసుకునేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్ని రంగాల్లో జరుగుతున్న పనే. కానీ జట్టు సమిష్టి కృష్టిని కొంత మంది ఖాతాలో వేసి ప్రముఖ పారిశ్రామికవేత్త చిక్కుల్లో పడ్డారు. ఒక్క ట్వీట్‌తో వ్యాపారవేత్తపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అతనే ప్రముఖ పారిశ్రామికవేత్త రామ చంద్ర ప్రసాద్ గోయెంకా గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హర్ష గోయెంకా తాజాగా చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఆయన ప్రాంతీయ వివక్షను వ్యక్తం చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సంకుచిత భావాలతో ఉన్నారని ఇలాంటివి ఆయనకు తగదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.

గుజరాతీలు చాలు:

అభిమానానికి హద్దులు ఉండాలి. కానీ శృతి మించిన అభిమానమే కొంపలు ముంచుతుంది. నిజానికి హర్ష గోయెంకా చేసిన కామెంట్స్ వెనుక ఉద్దేశం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ స్థాయి వ్యక్తి తాను చేస్తున్న కామెంట్స్ ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని మోసుకువెళ్తుందనే పట్టింపు లేకపోతేనే సమస్యగా మారుతుంది. చాలా విషయాలను నిర్వహించడానికి ఇద్దరు గుజరాతీలు సరిపోతారు.. అంటూ ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. 'రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, వ్యాపారంలో అంబాని, అదానీ, క్రికెట్ లో జడేజా, హార్దిక్ పాండ్య' ఉంటే చాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలే దుమారానికి కారణం అవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'గుజరాత్' అనే పదం చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో ఏ మంచి జరిగిన అది గుజరాతీయుల పనే అన్నట్లుగా ప్రచారం జరుగుతోందనే టాక్ ఉంది. గతంలో అనేక మంది ప్రధానులు దేశానికి పని చేసినా ఇలాంటి వాతావరణం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గుజరాత్ కు చెందిన మోడీ, అమిత్ షా తమ మిత్రులైన గుజరాత్ కు చెందిన అంబాని, అందానికి దేశ సంపదను దాచిపెడుతున్నారు అనే ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాల నుండి ప్రతిరోజు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్ష గోయెంకా చేసిన కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమ్ కష్టాన్ని ఇద్దరికి ఆపాదిస్తారా:

ఇక హర్ష గోయెంకా చేసిన కామెంట్ లలో క్రికెట్ కు జడేజా హార్దిక్ పాండ్య ఉంటే చాలన్న మాట క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆసియా కప్ లో భాగంగా గత ఆదివారం ఇండియా పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరింది. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య (33 నాటౌట్) చివర్లో సిక్స్ బాదడంతో టీమిండియా విజయం తీరాన్ని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వీరిద్దరూ గుజరాతీయులు కావడం వల్లే హర్ష గోయెంకా క్రికెట్ కు వీరిద్దరు ఉంటే చాలు అనేలా ట్వీట్ చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (35) పరుగులు చేశారు. బౌలర్లు సమిష్టిగా రాణించారు. కానీ ఈ విజయాన్ని కేవలం గుజరాతీయుల ఖాతాలే వేసే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ మీరు మార్వాడీనా సార్ అంటూ గోయెంకా ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. భిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారత్ లో రాజకీయాలు, వ్యాపారాల్లో గుజరాతీయుల హవా నడుస్తోందనే టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ దేశంలో అనేక మందికి హాట్ ఫేవరెట్ గేమ్ అయిన క్రికెట్ కు కూడా ప్రాంతీయ దురభిమానం అంటగట్టడం సరికాదని టీమ్ మొత్తం కష్టపడితేనే విజయం దక్కుతుంది కానీ ఏ ఒకరిద్దరి వల్ల అది సాధ్యం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత చెబుతున్నా హర్ష గోయెంకా సైతం గుజరాతీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హర్ష గోయెంకా ఇలా సంకుచిత భావన కలిగేలా ట్వీట్ ఎందుకు చేశారనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది. నెటిజన్ల కౌంటర్లపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Next Story

Most Viewed