దొంగతనం దాగదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

by Dishafeatures2 |
దొంగతనం దాగదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : దొంగతనం చేసింది ఎవరైనా సరే.. అది దాగదని, అది ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకసారి కచ్చితంగా బయటకు వస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్షలో భాగంగా ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా ప్రజాప్రతినిధులను తీవ్రంగా అవమానిస్తున్నారని, అందుకే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్లంతా ఈ రోజు కవిత పక్కనే ఉన్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్రలు చేస్తున్నారని, అయితే ఇదంతా తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి లిక్కర్ కేసు చాలా చిన్నదని, ఇంతకంటే పెద్ద స్కామ్ లు జరగుతున్నాయని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఈడీ కేసులకు, కవిత ధర్నాకు ఏమైనా సంబంధం ఉందా? అని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ కక్ష సాధింపులకు వెళ్లడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని అరుణ చురకలంటించారు. కవిత తప్పు చేస్తే తెలంగాణ ఎందుకు తలవంచుతుందని ఆమె నిప్పులు చెరిగారు.

తెలంగాణ అంటే కేసీఆర్ర కుటుంబం అనుకుంటే.. అది భ్రమే అని ఎద్దేవాచేశారు. విచారణలో నిజాలు తెలుస్తాయని ఆమె వెల్లడించారు. దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక మహిళా గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఎంత గౌరవమిస్తున్నారో ముందుగా సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని చురకలంటించారు. 60 వేలకు పైగా బెల్ట్ షాపులు తెలంగాణలో కొనసాగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే తెలంగాణ ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏంటనేది సర్కార్ కు పట్టింపు ఉండదా అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పుస్తెలను తెంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండటంతో బయటకు వెళ్లిన పిల్లలు క్షేమంగా వస్తారో లేదో తెలియని పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి తన పాలనను సమీక్షించుకోవాలని డీకే అరుణ సూచించారు. ప్రధాని మోడీ.. తాను చాయ్ అమ్మానని గర్వంగా చెప్పుకుంటారని, అదే కేసీఆర్ గతంలో దొంగ పాసుపోర్టుల దందా చేసినట్లు చెప్పగలరా? అని డీకే అరుణ ప్రశ్నించారు. బ్యూటీపార్లర్లు నడిపామని చెప్పుకోవడంలో తప్పేమీ లేదని ఆమె సూచించారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు నీటిపై రాతలుగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అందుకే లిక్కర్ స్కాంపై కాంగ్రెస్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదన్నారు. కవిత.. సోనియాగాంధీని పొగుడుతోందని, బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ ఎక్కడిదని ఆమె నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం ఉందని విర్రవీగవద్దని మంత్రి కేటీఆర్ కు డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed