పక్క రాష్ట్రాల సీఎంలకు జగన్మోహన్ రెడ్డి ఆదర్శం.. మంత్రి అమర్నాథ్

by Dishafeatures2 |
పక్క రాష్ట్రాల సీఎంలకు జగన్మోహన్ రెడ్డి ఆదర్శం.. మంత్రి అమర్నాథ్
X

దిశ, అనకాపల్లి: దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి పట్టణ పరిధిలోని 11,472 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు మూడో విడత ఆసరా పథకంలో భాగంగా 10,02,33,421 రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. స్థానిక రావు గోపాల్ రావు కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఏప్రిల్ 11వ తేదీన మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి అప్పటివరకు డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలను విడతల వారీగా తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందని అమర్నాథ్ పేర్కొన్నారు.

జనవరిలో నాలుగో విడత మొత్తాన్ని కూడా డ్వాక్రా మహిళలకు అందజేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏ కష్టము రాకుండా చూసుకుంటూ వస్తున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం పేదవాడిని ఎప్పుడు పట్టించుకోలేదని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. అవినీతి రహితంగా రెండు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు.

రాష్ట్రంలోని పేదవాళ్లను మరింతగా ఆదుకునేందుకు, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందజేసేందుకు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులను నియమించామని వాలంటీర్లు వీరిని కలుపుకొని పథకాలు అందజేయాలని అమర్నాథ్ సూచించారు. ఈనెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం కానుందని, రాష్ట్రంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసుకునే అవకాశం ఉంటుందని అమర్నాథ్ చెప్పారు. వినూత్న పథకాలతో ప్రజలకు ఆర్థిక ఆసరా కల్పించడంతోపాటు, సమస్యలను పరిష్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ.. కరోనా కాలంలో కూడా ప్రజలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో డ్వాక్రా మహిళల రుణ బాధలను తెలుసుకొని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ఆసరా పథకాన్ని అమలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు మూడు విడతల్లో అనకాపల్లి పట్టణ డ్వాక్రా మహిళలకు 28 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేసి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆయన చెప్పారు.

కాగా అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి అమర్నాథ్ ను ప్రతిపక్ష నాయకులు విమర్శించడం అర్థరహితమని అన్నారు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రతిపక్ష పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగర పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ.. మంత్రి అమర్నాథ్ పై కొంతమంది చేస్తున్న విమర్శలను తీవ్రంగా తప్పుపట్టారు. అమర్నాథ్ పిలుపు ఒక ప్రభంజనం.. ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి ఎంతో మంచి చేసిందని, ఆ కుటుంబానికి ఇక్కడ ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన వారందరికీ కూడా అమర్నాథ్ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని అన్నారు. అమర్నాథ్ చొరవతో అనకాపల్లిలో పలువురు గౌరవప్రదమైన పదవులలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని విజ్ఞప్తి చేశారు.

అమర్నాథ్ ను విమర్శించే హక్కు, అర్హత ప్రతిపక్షాలకు లేదని, విమర్శించే వారికి తగిన బుద్ధి చెప్తామని జానకిరామరాజు హెచ్చరించారు. జాజుల రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గం నుంచి అమర్నాథ్ ను తిరిగి గెలిపించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీలిమ భాస్కర్, మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, జోనల్ కమిషనర్ వెంకటరమణ తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ రామ్మూర్తి, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed