వరద ముంచెత్తినా.. కాలు కదపని మంత్రులు

by  |
Karimnagar
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. నాలుగైదు రోజులుగా రాష్ట్రమంతా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. రోడ్లు చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, ములుగు, ఆదిలాబాద్.. ఇలా అనేక జిల్లాల్లోనూ వరద బీభత్సం తీవ్రంగానే ఉన్నది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై వాహనాలు పడవల్లాగా కొట్టుకుపోతున్నాయి.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మీటింగుల్లో బిజీగా గడుపుతున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని పార్టీ మీటింగులో బిజీగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో నిమగ్నమయ్యారు. ప్రజలు మాత్రం వరద నీటిలో తిప్పలు పడుతున్నారు. ఇంట్లోని సామానంతా కొట్టుకుపోయి బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లమీద నడుస్తూనే మ్యాన్ హోల్‌లో పడి కొట్టుకుపోతున్నారు.

Sisilla

ప్రజలు బాధల్లో ఉంటే ప్రజా ప్రతినిధులుగా వెంటనే రంగంలోకి దూకి స్వయంగా సహాయక చర్యలను పరిశీలించడం, అధికారులను గైడ్ చేయడం వారి బాధ్యత. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఢిల్లీ నుంచి ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వారివారి నియోజకవర్గాల్లోనే ఉండి సహాయక చర్యలు చేపట్టేలా అధికారులతో సమన్వయం చేయాలని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం ముందుగానే ఖరారైన పార్టీ మీటింగులో మునిగిపోయారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు.

సిరిసిల్ల పట్టణం మునిగిపోయిందనే సంగతి తెలుసుకున్న తర్వాత కేటీఆర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కాకుండా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా. మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో నీట మునిగిన పట్టణాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని చాలా మంది ఆశించారు. ముఖ్యమంత్రి సైతం హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వరద ప్రాంతాలను సందర్శిస్తారని భావించారు. కానీ అవి కోరికలు, ఆశల వరకే పరిమితమయ్యాయి.

ఎంపీ బండి సంజయ్ సైతం ఈ నెల 17న విమోచనా దినోత్సవానికి నిర్మల్ బహిరంగసభకు వస్తున్నందున పాదయాత్రకు బ్రేక్ ఇస్తానని ప్రకటించిన అంశాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు ప్రస్తావిస్తూ.. ఇప్పుడు వరదల సమయంలో అలాంటి శ్రద్ధను ఎందుకు కనబర్చడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి ఎన్నుకున్న తర్వాత అధికారంలో కూర్చోబెడితే చివరకు తమను పలకరించడానికి కూడా నోచుకోలేదా అనే నిర్వేదం ఇప్పుడు వరద బాధితుల్లో వ్యక్తమవుతోంది.

Next Story

Most Viewed