వారి ఎంట్రీతో వేడెక్కిన దుబ్బాక

by  |
వారి ఎంట్రీతో వేడెక్కిన దుబ్బాక
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడున ఉప ఎన్నిక జరగనున్నది. ఉప ఎన్నికే అయినప్పటికీ, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ ఇక్కడే తమ బలగాలను మోహరించాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ సహా బీజేపీ పోలింగ్ బూత్ మొదలు మండలస్థాయి వరకు ఇన్‌చార్జిలను నియమించుకున్నాయి. కొన్నిచోట్ల ఇండ్ల సంఖ్యనుబట్టి, మరికొన్నిచోట్ల ఓటర్ల సంఖ్యను బట్టి కార్యకర్తలను కేటాయించాయి.

అధికార పార్టీ తరఫున మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై నడిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దుబ్బాక మినహా ఆయన దృష్టిలో మరో అంశమే లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరినీ ప్రచారంలోకి దించారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు ఏఐసీసీ నేతల వరకు రంగ ప్రవేశం చేశారు. బీజేపీ తరఫున ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమితులైన జితేందర్‌రెడ్డి అక్కడే మకాం వేశారు. రానున్న రోజుల్లో కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి రానున్నారు.

విమర్శలు, ఆరోపణలు…

మూడు పార్టీల ప్రచారం ఇప్పటికే హోరెత్తుతోంది. ఎవరి ఎజెండా ప్రకారం వారు విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు. నామినేషన్ల పర్వం ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. తర్వాత దాదాపు పది రోజుల పాటు ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సానుభూతి పవనాలపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. తొలుత బీజేపీని విమర్శించిన టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌పై దృష్టి పెట్టింది. హరీశ్‌రావుతోపాటు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీ ఛైర్మన్ భార్య తదితరులతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో నిత్యం పాల్గొంటున్నారు.

సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ప్రచారంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ప్రస్తావిస్తున్న అంశాలు, కంట తడిపెట్టడం, పక్కనే ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఓదార్చడం లాంటివన్నీ మహిళా ఓటర్లను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. తాను కోరుకున్న ఎన్నికలు కావని, రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేకపోయినా రామలింగారెడ్డి హఠాన్మరణం తనను ఈ రోజు ఓట్లు అభ్యర్థించే పరిస్థితి తీసుకొచ్చిందని ఆమె తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

ఇంటింటికి ఆర్ఎస్ఎస్…

ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే అన్ని గ్రామాలనూ చుట్టుముట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇండ్లల్లో ఉంటూ, ఎన్నికల ప్రచారం మీద దృష్టి పెడుతున్నారు. బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకుల మొదలు కేంద్ర మంత్రుల వరకు ఈ నియోజకవర్గంలో ప్రచారానికి రానున్నారు. విద్యుత్ బిల్లు, కేంద్ర వ్యవసాయ చట్టాలపై అధికార టీఆర్ఎస్ విమర్శలు చేస్తుండడంతో ఆ శాఖల మంత్రులు ఆర్కే సింగ్, నరేంద్రసింగ్ తోమర్ లాంటివారిని రప్పించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, కేంద్రం నుంచి వివిధ పథకాలకు వస్తున్న డబ్బునే రాష్ట్రం తన ఖాతాలో వేసుకుని సంక్షేమ పథకాల గొప్పదనాన్ని ప్రచారం చేసుకుంటోందని వివరాలను వెల్లడించడంపై ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రులతోనే విమర్శించే ప్లాన్‌ను అమలుచేయబోతోంది.

టీఆర్ఎస్ కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్…

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ నియమితులైన తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆయన మార్కు తరహా మార్పు కోసం తపిస్తున్నారు. దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌కు ప్రత్యేక టార్గెట్ ఇచ్చారు. ప్రచారం పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండాల్సిందిగా స్పష్టం చేశారు. దీంతో ఆయన అక్కడే మకాం వేశారు. అధికార పార్టీకి ప్రజల మద్దతు లేదన్న సంకేతాన్ని దుబ్బాక గెలుపు ద్వారా ఇవ్వాలనుకుంటోంది.

ఈ నియోజకవర్గం నుంచి గతంలో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడం వెనక వ్యూహం కూడా ఇదే. ముత్యంరెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టాలని భావిస్తోంది. మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల నడుమ ఇప్పటికే వేడెక్కిన దుబ్బాక ఉప రాజకీయం నామినేషన్ల గడువు తర్వాత మరింత జోరందుకోనుంది. ఇక్కడి గెలుపు ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన రాజకీయ భవిష్యత్తుకు దోహదపడనుంది.



Next Story

Most Viewed