గ్రేటర్ ఎన్నికలు : పోలీసుల దృష్టి వారిపైనే

by  |
గ్రేటర్ ఎన్నికలు : పోలీసుల దృష్టి వారిపైనే
X

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికలు నాలుగు జిల్లాల వ్యాప్తంగా 150 డివిజన్లలో కొనసాగుతుండగా, గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలోనే ఈ డివిజన్లు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకటించగానే హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పోలీసు అధికారులతో ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికలలో పోలీసుల పాత్ర, అందుకు అనుగుణంగా వ్యవహారించాల్సిన విధులు, మార్గదర్శకాలను సూచించారు. సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు పురికొల్పే అల్లరి మూకలు, తరుచూ వివాదాలలో జోక్యం చేసుకుంటూ పలు కేసులు నమోదైన వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలతో రౌడీ షీటర్లుగా, పీడీ యాక్ట్ నమోదు జాబితాపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత బల్దియా ఎన్నికల్లోనూ నేరాలకు పాల్పడేందుకు అవకాశం ఉందనే కోణంలో వారందరినీ బైండోవర్ చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

అసాంఘిక శక్తులపై పీడీ పిడుగు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలలో కరుడుగట్టిన నేరస్థులపై పోలీసులు ఇటీవల పీడీ యాక్ట్ లను అత్యధికంగా నమోదు చేస్తున్నారు. వాస్తవానికి మూడు కేసులకు పైగా నేరాలు నమోదు తర్వాత పీడీ యాక్ట్ ప్రయోగించే పోలీసులు ఇటీవల నేరాల కట్టడికి నేరస్థుల ప్రవర్తన, నేరాల స్థాయి ఆధారంగా రెండు కేసులు ఉన్నవారిపై కూడా పీడీ ప్రయోగిస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరం కావడంతో అభివృద్ధికి ఆటంకంగా మారే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపడతున్నారు.

అందులో భాగంగానే భూ వివాదాలలో తలదూర్చుతూ, బెదిరింపులకు పాల్పడటం, బలవంతంగా వసూళ్లు చేయడం, సెటిల్మెంట్లకు పాల్పడటం, తమ మాట వినని వారిపై దాడులకు తెగబడటం, పలు సందర్భాలలో నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేయడం తదితర కార్యకలాపాలు నిర్వహించే వారిపై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తున్నారు. అంతే కాకుండా, నగరంలోని ఇటీవల పాతబస్తీలో రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్య పోరు పలు హత్యలకు దారితీసిన విషయాలను సైతం పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నేరాలకు పాల్పడుతున్న వారిపై ఎన్ని కేసులు నమోదు చేసినా.. వారి తీరు మారకపోవడంతో పోలీసు శాఖ వారిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది.

బైండోవర్లకు సిద్ధం..

ప్రస్తుతం బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహించడంపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్ నమోదయిన వ్యక్తులపై జాబితాను ఆయా జోన్ల డీసీపీలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ఏడాది 100కు పైగా పీడీ యాక్ట్‌లు నమోదవుతున్నాయి. ఈ ప్రకారం 2018లో 105, 2019లో 138, 2020 (ప్రస్తుతానికి) 88 కరుడుగట్టిన నేరస్థులపై పీడీ యాక్ట్ ను ప్రయోగించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకూ 264 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.

ఇదిలా ఉండగా, సైబరాబాద్ పరిధిలో 838 మంది రౌడీ షీటర్లు ఉండగా, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 675 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో సుమారు 750కు పైగా రౌడీ షీటర్లు ఉండగా, ఒక్క సౌత్ జోన్ పరిధిలోనే దాదాపు 450కు పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. నగరంలో రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్ కలిగిన వారికి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చి.. ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ కు వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లు బైండోవర్‌ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లకు, వివాదాలలో జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, గతంలో పీడీ యాక్ట్ నమోదైన వారిని పోలీసులు బైండోవర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed