మహిళలపై నేరాల నిరోధానికి.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం

by  |
మహిళలపై నేరాల నిరోధానికి.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాల నిరోధానికి స్వయం సహాయక సంఘాలను(డ్వాక్రా)భాగస్వామ్యం చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. బాల్య వివాహాలు, గృహ హింస, లైంగిక వేధింపుల నిరోధంపై రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లు అంగీకారానికి వచ్చాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతి లక్రాలు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ చోట పోలీసులు భౌతికంగా ఉండలేరని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతా, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని అన్నారు.

స్వాతి లక్రా మాట్లాడుతూ.. గత ఏడాదిలో షీ టీమ్ ద్వారా అందిన 5 వేల ఫిర్యాదులలో 68 శాతం వాట్సాప్ ద్వారా అందినట్టు తెలిపారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాలలో సుమారు 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నట్టు వివరించారు. వీరందరికీ గృహహింస, పని ప్రదేశాలలో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం అభినందనీయం అన్నారు. సమావేశంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనగా.. ఉమెన్ సేప్టీ వింగ్ డీఐజీ సుమతి, రక్షిత్ తాండన్, గీతా చల్ల, శృతి ఉపాధ్యాయ్ లు ప్రసంగించారు.

ఇకపై క్యూఆర్ కోడ్‌తో ఫిర్యాదు..

మహిళలపై వేదింపులు, గృహహింస, సైబర్ నేరాలు, వర్క్ ప్లేస్ హారాస్మెంట్ తదితర సమస్యలపై క్యూఆర్ కోడ్‌తో ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళా భద్రత విభాగం ప్రవేశ పెట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా.. క్యూఆర్ కోడ్ ఆధారంగా మహిళా భద్రత విభాగానికి ఫిర్యాదుచేసే విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు, బాలలు ఇకపై పలు నేరాలపై ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని షీ టీమ్ వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండానే కేవలం క్యూఆర్ కోడ్‌తో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. తమ మొబైల్ ఫోన్‌లో ఈ లింక్‌ను సేవ్ చేసుకొని, లింక్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు షీ-టీమ్ సెంట్రల్ సర్వర్‌కు వెళ్తోంది. దీంతో ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, సమస్యల పరిష్కారానికి పట్టిన సమయం, అధికారుల ప్రవర్తన అంశాలు తదితర విషయాలు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. పౌరులు తమ స్పందనను కూడా ఈ కోడ్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే విభాగాలను గుర్తించడం, పనితీరును మరింత మెరుగుపర్చుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది.

Next Story

Most Viewed