ఆటగాళ్లు సేఫ్.. మిగతా వాళ్లకు లాస్

by  |
ఆటగాళ్లు సేఫ్.. మిగతా వాళ్లకు లాస్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో లీగ్‌ను బీసీసీఐ అర్దాంతరంగా వాయిదా వేసిన తెలిసిందే. సగం లీగ్ మిగిలి ఉండగానే మ్యాచ్‌లు వాయిదా పడటంతో బీసీసీఐతో పాటు బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంచైజీలు భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తున్నది. బీసీసీఐ ఈ సీజన్‌లో రూ. 2000 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోనుండగా.. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా మిగిలిన మ్యాచ్‌ల యాడ్ ఆదాయం నష్టపోనున్నది. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. కానీ, క్రికెటర్లకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదని తెలుస్తున్నది. ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం వారికి పూర్తి వేతనం వస్తుందని తెలుస్తున్నది. ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్‌లు ఆడినా.. వారికి వేతనం మాత్రం పూర్తిగా చెల్లించాల్సి రావడం ఫ్రాంచైజీలకు భారమే అని చెప్పుకోవచ్చు.

వేతనాలపై నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయినా క్రికెటర్లు పూర్తి వేతనం అందుకోనున్నారు. స్టాండర్డ్ ఐపీఎల్ ప్లేయర్స్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు వారికి పూర్తి వేతనం అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటగాళ్లకు మూడు వాయిదాల్లో వేతనాలు చెల్లిస్తూ ఉంటారు. మొదటి వాయిదా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన రెండు వాయిదాలు ఐపీఎల్ సీజన్ ముగిసే లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సీజన్ అర్దాంతరంగా వాయిదా పడటంతో వారికి వేతనాలు వస్తాయా రావా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, కాంట్రాక్టు నిబంధనల మేరకు ఆటగాళ్లందరి జీతాలు ఫ్రాంచైజీ ఇన్స్యూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడి ఉంటాయి. క్రికెటర్లు గాయపడినా.. ఏదైనా కారణంగా లీగ్ రద్దయినా ఈ బీమా ద్వారా ఆటగాళ్లకు వేతనాలు అందుతాయి. ఇప్పుడు ఐపీఎల్ వాయిదా పడటంతో వారందరికీ ఇన్స్యూరెన్స్ సంస్థ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ సీజన్‌కు ముందే గాయపడిన శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ నిబంధనల మేరకే పూర్తి వేతనం చెల్లించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆటగాళ్లందరికీ కలిపి రూ. 483 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉన్నది.

దెబ్బ మీద దెబ్బ..

బీసీసీఐకి గత ఏడాది నుంచి ఐపీఎల్ ఆదాయం తగ్గిపోయింది. గత ఏడాది వీవో టైటిల్ స్పాన్సర్‌గా తప్పుకోవడంతో డ్రీమ్ ఎలెవెన్‌ను తీసుకొని వచ్చారు. అయితే డ్రీమ్ ఎలెవెన్ కేవలం రూ. 220 కోట్లు మాత్రమే చెల్లించింది. వీవో అయితే రూ. 440 కోట్లు చెల్లించేది. ఇక ఈ ఏడాది కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో బ్రాడ్ కాస్టర్ ఆ మేరకు మాత్రమే చెల్లింపులు చేయనున్నది. స్టార్ గ్రూప్ మ్యాచ్‌కు రూ. 54.4 కోట్ల చొప్పున రూ. 1577 కోట్లు చెల్లించనున్నది. మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించి దాదాపు రూ. 1700 కోట్లు బీసీసీఐ కోల్పోతున్నది. ఇక వీవో మ్యాచ్‌కు రూ. 7.3 కోట్లు చెల్లిస్తుండగా.. జరగని మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐకి రూ. 225 కోట్ల ఆదాయం తగ్గినట్లే. మరోవైపు బీసీసీఐతో జత కట్టిన టాటా, అన్‌అకాడెమీ, డ్రీమ్ ఎలెవెన్, క్రెడ్, అప్‌స్టాక్స్, పేటీఎం, సీయట్ వంటి కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేసే ఆలోచనలో లేవు. ఇలా గత ఏడాది నుంచి ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఆదాయంపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. స్టార్ గ్రూప్ కూడా యాడ్స్ రూపంలో చాలా నష్టపోనున్నది. ఈ ఏడాది దాదాపు రూ. 4 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించాలని భావించింది. కానీ లీగ్ సగంలో ఆగడంతో సగానికి పైగా నష్టాలు మూటగట్టుకోనున్నది.

ఫ్రాంచైజీలకూ అదే బాధ

ఐపీఎల్‌లో రెండు మూడు ఫ్రాంచైజీలు తప్ప మిగతావి అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. స్పాన్సర్లు, బీసీసీఐ షేర్, టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకు భారీగానే ఆదాయం వచ్చేది. గత ఏడాది ఖాళీ స్టేడియంలలో మ్యాచ్‌లు జరగడంతో ఫ్రాంచైజీలకు గేట్ ఆదాయం లేకుండా పోయింది. ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఒక సీజన్‌లో దాదాపు రూ. 30 కోట్లు టికెట్ ఆదాయాన్ని ఫ్రాంచైజీలు పొందేవి. ఇప్పుడు ఆ ఆదాయం లేకుండా పోయింది. మరోవైపు సగం లీగ్ మాత్రమే జరగడంతో బీసీసీఐ నుంచి వచ్చే ఆదాయం కూడా ఆ మేరకు పడిపోనున్నది. మరోవైపు బయోబబుల్ ఏర్పాటు, ఆటగాళ్ల బస, ప్రయాణానికి భారీగా ఖర్చు చేశాయి. పూర్తి లీగ్ జరిగి ఉంటే ఎంతో కొంత ఆదాయం ఫ్రాంచైజీలకు వచ్చి సర్దుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు నష్టాలు భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Next Story

Most Viewed