‘దళితబంధు’ ఎప్పుడు పుట్టిందో చెప్పిన వినోద్ కుమార్..

by  |
‘దళితబంధు’ ఎప్పుడు పుట్టిందో చెప్పిన వినోద్ కుమార్..
X

దిశ, కరీంనగర్ సిటీ : దళిత బంధు పథకం హుజురాబాద్ ఉపఎన్నిక కోసం పుట్టింది కాదని, దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఈ పథకం అమలు చేసేందుకు దశాబ్దం కిందటే సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశాడని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోని పలు మండలాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గం నాయకులు శనివారం నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. 2002లోనే హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్ హోటల్లో దళిత మేధావులతో సమావేశాలు నిర్వహించి ఇలాంటి ఎన్నో పథకాల కొరకు ప్లాన్ చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర పురోగతి కోసం అవసరమైన నీటి ప్రాజెక్టులపై ముందుగా దృష్టి సారించి, వాటిని పూర్తి చేసిన అనంతరం దళితుల కొరకు సంక్షేమ పథకాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. దళితులందరినీ వ్యాపారస్తులుగా చూడాలనే లక్ష్యంతో మద్యం దుకాణాల కడ్తాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలలో కూడా దళితులకు వాటాలు కల్పించి వారిని షేర్ హోల్డర్‌గా మారుస్తామన్నారు. విదేశీ విద్యలో ఎవరూ అడుగకుండానే మెరిట్ విద్యార్థులకు రూ. 20 లక్షలు ఇచ్చి విదేశీ విద్యను అందిస్తున్నామని చెప్పారు. 1985వ సంవత్సరంలోనే సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దళితునికి అవకాశం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని గుర్తు చేశారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో కార్పొరేటర్ కాంశాల శ్రీనివాస్ తో పాటు పలు దళిత సంఘాల నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed