పీయూష్ వ్యాఖ్యలు తెలంగాణకు అవమానకరం : గుత్తా

by  |
Gutta Sukhendar reddy
X

దిశ, చిట్యాల: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రితో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల పట్ల కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజానీకానికి అవమానకరంగా ఉన్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పక్షాన మాట్లాడేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి అవహేళనగా మాట్లాడడం సరైంది కాదన్నారు. సీఏ చదివిన గోయెల్‌కు వ్యవసాయంపై అవగాహన శూన్యమని, అలాంటి వ్యక్తికి రైతుల సమస్యలు, రైతుల బాధలు, కష్టాలు ఏం తెలుస్తాయని మండిపడ్డారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు రైతు సమస్యలపై చర్చించకుండా దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని, వారు కేవలం తెలంగాణలో మీడియా ముందు ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏనాడు కూడా రైతుల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు. బీజేపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఉద్దేశ్యంతో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని గుత్తా ఆరోపించారు.

Next Story