గులాబీ రంగులో మంచు.. ప్రమాదానికి సూచీ?

by  |
గులాబీ రంగులో మంచు.. ప్రమాదానికి సూచీ?
X

ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లో గల ప్రెసెనా గ్లేసియర్ వద్ద గులాబీ రంగులో మంచు పడుతోంది. చూడ్డానికి అందంగా కనిపిస్తున్న ఈ మంచును స్ట్రాబెర్రీ స్నో అని, వాటర్‌మెలన్ స్నో కూడా పిలుస్తారు. ఎలాగూ ఆకర్షణీయంగా ఉంది కదా.. అని ఫొటోలు దిగి ఎంజాయ్ చేసి, ప్రతి ఏడాది ఇలాగే పడితే బాగుణ్ణు అని అనుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇలా గులాబీ రంగులో మంచు పడుతోందంటే పర్యావరణం విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలని కూడా ఇటలీలోని నేషనల్ రీసెర్చి కౌన్సిల్ వద్ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలార్ సైన్సెస్ ప్రొఫెసర్ బియాగో డి మారో అంటున్నారు.

ఇలా మంచు గులాబీ రంగులో మారడానికి ఒక ఆల్గే కారణమని బియాగో చెప్పారు. వసంతకాలం, వేసవి కాలంలో ఆల్ప్స్ పర్వతాల్లోని గ్లేసియర్లలో అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుందని, అయితే ఈమధ్య కాలంలో తరచుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. 2020 సంవత్సరంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఆల్గే బాగా వృద్ధి చెందడం వల్ల ఇలా గులాబీ రంగు మంచుపడుతోందని, ఈ ఆల్గే ఇంకా ఎదుగుతూ ఉంటే మంచు గడ్డలు త్వరగా కరిగిపోతాయని డిమారో వివరించారు. తద్వారా సముద్ర మట్టాలు పెరిగి ద్వీపదేశాలు మునిగి పోవచ్చు. ఇలా గులాబీ రంగు మంచుకి కారణమైన ఆల్గే పేరు క్లామిడోమోనస్ నివాలిస్. అయితే దీనికి, వాతావరణ మార్పుకు ఉన్న సంబంధం గురించి ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదని, ఈ గులాబీ రంగు మంచు కారణంగా ఆ ఆల్గే గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డియాగో అన్నారు.



Next Story

Most Viewed