విలేజ్ టు సిటీస్..ఈత చెట్లకు ఫుల్ డిమాండ్

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-14 20:22:59.0  )
విలేజ్ టు సిటీస్..ఈత చెట్లకు ఫుల్ డిమాండ్
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఈత చెట్లు చెరువు కట్టలపై, ఊరు చివర వాగులు, వంకల్లో కనిపిస్తుంటాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈత కల్లుకు భలే గిరాకీ ఉంటుంది. మారుతున్న కాలానికనుగుణంగా ఈత చెట్లు ఫ్యాషన్​ట్రీగా మారాయి. ప్రధాన నగరాల్లో భలే క్రేజీని కూడగట్టుకుంటున్నాయి. వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, హోటళ్ల వద్ద గ్రీనరీలా ఈత చెట్లను పెంచుతున్నారు. ఈ చెట్లతో రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు.

ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాల్లో మొక్కలను పెంచడం కష్టతరమైంది. అయితే ఇండ్లు, వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలంలో అందమైన మొక్కలు పెంచేందుకు ఇష్టపడుతున్నారు. అయితే తక్కువ నీటితో పెరిగి అందంగా కనిపించే ఈత చెట్లపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో ఈత చెట్టు విలువ రూ.5 వేల నుంచి రూ.17 వేల వరకు ధర పలుకుతుందంటే మామూలు విషయం కాదు. చూసేందుకు అందంగా కనిపించడమే కాకుండా సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతాయని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

15 రోజుల్లోనే..

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈత మొక్కలు తీసుకువస్తారు. నర్సరీల్లో జోరపు బస్తాల్లో పెట్టి పెంచుతారు. ఎవరైనా కొనుగోలు చేస్తే చెట్లను పూర్తిగా పెకిలించి జేసీబీ సాయంతో వాహనాల్లో అవసరమైన ప్రాంతాలకు తరలిస్తారు. నాటిన 15 రోజుల్లోనే పచ్చదనం సంతరించుకుంటుంది. 45 రోజుల్లో పూర్తిగా ఆహ్లాదం పంచుతుంది. హైదరాబాద్ నగరంలో పలువురు వ్యాపారులు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వీటిని పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story