కలుసుకోవాలని..

by  |
కలుసుకోవాలని..
X

సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజల ఆసక్తి

దిశ, న్యూస్​ బ్యూరో:

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) కట్టడికి విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు పైకి మామూలుగానే కనిపిస్తున్నా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ర్ట మంత్రి కేటీఆర్​ శనివారం రాత్రి #ఆస్క్​ కేటీఆర్​ ట్యాగ్​తో తన ట్విట్టర్​ ఖతాలో ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. దీంతో ట్విట్టర్ వేదికగా పలువురు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్​తో భార్యభర్తలు, తండ్రి కూతుళ్లు దూరంగా ఉండిపోయామనీ, తమను కలిపేందుకు చర్యలు తీసుకోవాలని ఒకరు కోరారు. మరికొందరు వైద్యం కోసం తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుకున్నట్టు కోరారు. వీరి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మంత్రి కేటీఆర్‌కు పలువురి అభ్యర్థనలు..

– కొడుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం 3 నెలల తర్వాత హైదరాబాద్​ వచ్చామనీ, లాక్​డౌన్​తో ఇక్కడే ఉండిపోయామని బెల్లంపల్లికి చెందిన లావణ్య ట్విట్టర్​లో తన బాధను వివరించారు. బెల్లంపల్లిలో ఉన్న తన భర్తకు డయాబెటిస్​ ఉందనీ, అక్కడే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ, తాను వెళ్లేందుకు సాయం చేయాలని మంత్రికి విన్నవించారు.

– తన మూడేండ్ల కూతురితో పాటు తల్లిదండ్రులు రాజమండ్రిలో ఉండిపోయారనీ, వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉండటంతో చిన్నారిని సముదాయించడం వీలు కావడం లేదు. అమ్మను చూడాలని తన కూతురు రోజూ ఏడుస్తోందనీ, దయచేసి తాను వెళ్లేందుకు అనుమతించాలని హైదరాబాద్​కు చెందిన ఇందిరా ప్రియదర్శిని మంత్రి కేటీఆర్​ను కోరారు.

– తన కుటుంబమంతా విజయవాడ దగ్గర లాక్​డౌన్​తో చిక్కుబడి పోయారనీ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో తన భార్య తాత చనిపోయాడని రాంపాక సతీష్​ ఫొటోలతో మంత్రికి విన్నవించారు. సొంత కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు లేకుండా పోయిందనీ, కనీసం చివరి చూపు చూసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరాడు.

– 15 రోజులుగా తన కూతురును చూడలేకపోతున్నాననీ, లాక్​డౌన్​ తర్వాత తాము కలుసుకునే అవకాశం లేకుండాపోయిందని మహ్మద్​ అజారుద్దీన్​ మంత్రికి ట్యాగ్​ చేశారు.

– శ్రీకాకుళం జిల్లాకు చెందిన అశ్విని ప్రస్తుతం నెలల నిండిన గర్భిణి. హైదరాబాద్​లోని వర్కింగ్​ ఉమెస్​ హాస్టల్​లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న తనకు చూసుకునేవారు లేరనీ, తమ ఊరికి పంపించాలని విన్నవించుకున్నారు.

– కాశీ యాత్రలో చిక్కుకుపోయిన తమవారిని తీసుకురావాలని కోరుతూ మీడీయా క్లిప్పింగ్​లతో దేవి మంత్రిని ట్విట్టర్​ వేదికగా కోరారు.

– రాజస్తాన్​ రాష్ట్రం ఉదయ్​పూర్​కు చెందిన తామంతా సిద్దిపేటలో ఉండిపోయామనీ, తమను సొంత ప్రాంతాలకు పంపించాలని ప్రభు గుర్జార్​ కేటీఆర్​ను ట్యాగ్​ చేశారు.

– తన సోదరుడి భార్య ప్రెగ్నెన్సీతో హైదరాబాద్​లో ఉందనీ, ప్రసవం, మందుల కోసం వైజాగ్​ వెళ్లాలని శేషు మంత్రిని కోరారు. ప్రస్తుతం ఎక్కడ వెళ్లాడానికి వీలు లేకుండా పోయిందనీ, మొదటి డెలివరీ కావడంతో కుటుంబమంతా ఆందోళనతో ఉన్నామని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

వ్యక్తిగత సమస్యలతో ఉద్యోగాలు, వలస కూలీలు, లాక్​డౌన్​ కాలంలో వేతన చెల్లింపు అంశాలపై కూడా ప్రజల నుంచి మంత్రికి ప్రశ్నలు, విజ్ఞాపనలు వచ్చాయి. ప్రజల నుంచి స్పందన ఎక్కువగానే వచ్చినప్పటికీ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నుంచి చాలా వాటికి స్పందన రాలేదు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కేటీఆర్​ సమాధానం కోసం ఎదురుచూస్తున్నామనంటూ మిస్టర్​ బీన్​, కామిక్​ చిత్రాలతో మళ్లీ యాష్​ ట్యాగ్​ను కొనసాగించారు. అయితే, ట్విట్టర్​ వేదికగా మంత్రికి నేరుగా సమస్యలు చెబితే ఏమైనా పరిస్కారం లభిస్తుందేమోననుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందనీ, స్పందన కరువయిందని పలువురు వాపోతున్నారు.

Tags: ktr, twitter, lockdown, telangana, hashtag, people requests



Next Story

Most Viewed