హుస్నాబాద్ ఎమ్మెల్యేకు హుజురాబాద్‌లో చేదు అనుభవం.. (వీడియో)

by  |
Mla-satish
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్‌లో అధికార పార్టీ నాయకులకు, అధికారులు స్థానికులు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని రంగాపూర్, రాజాపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రంగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల్లో సతీష్ కుమార్‌ను అడ్డుకున్నారు. ప్రోటోకాల్‌కు విరుద్దంగా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే, తాను కేవలం గెస్ట్‌గా మాత్రమే వచ్చానని శంకుస్థాపనలు స్థానిక ఎంపీపీ చేస్తున్నారని ఎమ్మెల్యే సతీష్ బాబు బదులిచ్చారు. రంగాపూర్ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్‌ను ఆహ్వానించకుండా శంకుస్థాపనలు ఎలా చేశారంటూ నిలదీశారు.

శిలాఫలకాలు లేకుండా నిధుల వివరాలు లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి హుజురాబాద్ స్టేషన్‌కు తరలించారు.

డీఈఈ ఘెరావ్..

మరోవైపున మండలంలోని రాజాపూర్ గ్రామంలో పంచాయితీరాజ్ డిప్యూటీ ఈఈ ప్రకాష్ రావును గ్రామస్తులు ఘెరావ్ చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేతో కలిసి మీరెలా వచ్చారు? అధికారికంగా వచ్చారా అనధికారికంగా వచ్చారా అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. తాను అనధికారికంగా వచ్చానని డీఈఈ సమాధానం ఇవ్వడంతో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆఫీసులో ఉన్నాయని డీఈఈ సమాధానం చెప్పడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed