హైదరాబాద్ పేరు మార్చడానికి ఆయన ఎవరు: ఉత్తమ్

by  |
హైదరాబాద్ పేరు మార్చడానికి ఆయన ఎవరు: ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో దోపిడి దొంగల పాలన నడుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రాన్ని ఏడేళ్ల పాటు దోచుకున్నారని మండిపడ్డారు. శనివారం ఎల్​బీ స్టేడియంలో నిర్వహించిన టీఆర్​ఎస్​ బహిరంగ సభలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా ఆయన మాట్లాడలేదని, బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్ అయిందన్నారు. టీఆర్ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది అని ఉత్తమ్ వెల్లడించారు. గాంధీభవన్​లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు మతం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని, వరదల్లో వంద మంది చనిపోతే, కేంద్ర హోంమంత్రిగా కనీసం పరామర్శించలేదన్నారు. కానీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ ప్రజలను అవమానపరిచేలా ఉందని, ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేస్తున్నారని, ఆయన రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..? అని ప్రశ్నించారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరం లేదని, యూపీ సీఎం ఆయన రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు జరుగుతుంటే మిన్నకుండి పోయారని మండిపడ్డారు. కర్ణాటక ఎంపీ అడ్డగోలుగా మాట్లాడారని, యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామన్నారన్నారు. హైదరాబాద్​ పేరు మార్చేందుకు మీరెవ్వరని దుయ్యబట్టారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి మాత్రమేనని, హైదరాబాద్ గురించి మాట్లాడటానికి ఆయనకేం ఏం సంబంధం ఉందన్నారు.

అసలు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందన్నారు. గ్రేటర్ అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ హయాంలోనేని, వరదలు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు ఎందుకు రాలేదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా అని ఉత్తమ్​ మండిపడ్డారు. సంజయ్​ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని, పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ రెండు పార్టీలు హైదరాబాద్ నగర అభివృద్ధికి పెద్దగా చేసేందేమి లేదని, టీఆర్ఎస్ గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేదన్నారు. కరోనా, వరదల సమయంలో ప్రజలను రెండు అధికార పార్టీలు విస్మరించాయన్నారు. ఎంఐఎం పూర్తిగా అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తుందని ఉత్తమ్​ ఎద్దేవా చేవారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు హైదరాబాద్ ప్రజలను మోసం చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఆ మూడు పార్టీలను తరమికొట్టి హైదరాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఉత్తమ్​ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed