బీజేపీతో పవన్ తెగదెంపులు?

by  |
బీజేపీతో పవన్ తెగదెంపులు?
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో బీజేపీ నుంచి పవన్ బయటికి రానున్నారా?.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం ఖాయమా?.. ఇవాళ పవన్ చేసిన ప్రకటన తర్వాత అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణికి పవన్ మద్దతిస్తున్నట్లు ప్రకటించడంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు వాడుకుని వదిలేస్తున్నారని, చులకనగా చూస్తున్నారని పవన్ ఘాటు విమర్శలు చేశారు పవన్ చేసిన ప్రకటనపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో పొత్తులో ఉండి టీఆర్‌ఎస్‌కు ఎలా సపోర్ట్ చేస్తారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడంతో త్వరలో బీజేపీ నుంచి పవన్ బయటికొస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతుందని ప్రకటించిన పవన్.. ఆ తర్వాత మాట మార్చి బీజేపీకి సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో ఏకంగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. దీంతో త్వరలో బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇక పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రజలు వ్యతిరేకించిన పార్టీకి పవన్ మద్దతిచ్చారని, జనసేనతో పొత్తుపై తాము ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు.

అటు ఏపీలో కూడా బీజేపీతో పొత్తులో ఉండటం వల్లన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పవన్ పాల్గొనలేకపోతున్నారు. అలాగే ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించలేకపోతున్నారు. ఈ తరుణంలో బీజేపీతో కలిసి ఉండటం వల్ల పవన్‌కి నష్టం తప్పితే.. లాభం లేదనే చర్చ గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీతో విడిపోవాలనే నిర్ణయానికి పవన్ వచ్చారా?.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

Most Viewed