సివిల్ ఆస్పత్రి డాక్టర్లకు నో ‘టైమ్’ సెన్స్.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

by  |
సివిల్ ఆస్పత్రి డాక్టర్లకు నో ‘టైమ్’ సెన్స్.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
X

దిశ, పరకాల : ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడానికి స్తోమత లేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటారు. అయితే, ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితి హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో నెలకొంది. ప్రజారోగ్యమే ప్రధానాంశంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చేలా ఇక్కడి వైద్యులు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. పరకాల చుట్టుపక్కల మండలాలకు చెందిన రోగులు నిత్యం వందల మంది వివిధ రకాల వైద్య సేవల కోసం పరకాల సివిల్ ఆస్పత్రికి వస్తుంటారు. ఇందులో పాయిజన్ తీసుకున్న వారు, యాక్సిడెంటల్ తదితర ఎమర్జెన్సీ కేసులు సైతం వస్తుంటాయి.

ఈ క్రమంలో నిత్యం డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండి సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కానీ, సివిల్ ఆస్పత్రిలో అందుకు భిన్నంగా వైద్యులు సమయపాలన పాటించకుండా చుట్టపు చూపుగా వచ్చి మొక్కుబడిగా వైద్య సేవలు అందిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు. సకాలంలో, సరైన విధంగా వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు లేని కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వారు వేసే బిల్లులు భరించలేక సతమతమవుతున్నామని రోగులు వాపోతున్నారు.

అంతేకాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పరకాల సివిల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed