కరోనా తర్వాత భారతీయ కంపెనీల విలువ 68 శాతం వృద్ధి!

by  |
reliance
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఏడాది దేశీయ దిగ్గజ కంపెనీల నికర విలువ 68 శాతం పెరిగిందని హురున్ ఇండియా నివేదిక తెలిపింది. దీనివల్ల చిన్న వ్యాపారాలు, సాధారణ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని హురున్ ఇండియా నివేదిక అభిప్రాయపడింది. హురున్ ఇండియా-500 జాబితా మొత్తం నికర విలువ రూ. 228 లక్షల కోట్లని ఇది భారత జీడీపీ కంటే ఎక్కువని నివేదిక పేర్కొంది. ఇందులో 200 కంపెనీల విలువ గతేడాది కాలంలో రెండింతలు పెరగడం గమనార్హం.

ఈ జాబితాలో రూ. 16.7 లక్షల కోట్ల విలువతో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రూ. 13.1 లక్షల కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 9.1 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. లిస్టెడ్ కానీ విభాగంలో వ్యాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియా రూ. 1.8 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ సంస్థ విలువ 127 శాతం పెరిగింది. ఈ జాబితాలో కంపెనీలు మొత్తం 43 నగరాల నుంచి ఉన్నాయి. ఇందులో అధికంగా ముంబై నుంచి 167 కంపెనీలు, బెంగళూరు నుంచి 51, చెన్నై నుంచి 38 కంపెనీలు ఉన్నాయి. అలాగే, రంగాల వారీగా చూస్తే ఆర్థిక సేవల విభాగం 77 కంపెనీలతో అగ్రస్థానంలో ఉండగా, ఆరోగ్య సంరక్షణ విభాగంలో 64 కంపెనీలున్నాయి.

Next Story

Most Viewed